‘శైలజా రెడ్డి అల్లుడు’ రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్

sailaja-reddy-alludu Telugu Movie Review

నటీ నటులు : నాగ చైతన్య , అను ఇమ్మానుయేల్, రమ్య కృష్ణ ,కళ్యాని నటరాజన్
రచన -దర్శకత్వం : మారుతి
నిర్మాత : నాగ వంశీ
సంగీతం : గోపి సుందర్
సినిమాటోగ్రఫీ : నిజార్ షఫీ
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరావు

sailajareddy-alludu-movie

గడసరి అత్త – బుర్రున్న అల్లుళ్ల‌ ఫార్ములా ఒక ఎవ‌ర్ గ్రీన్ ఫార్ములా. ఈ ఫార్ములాను బేస్ చేసుకుని ఎన్ని క‌థ‌లొచ్చినా ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతూనే ఉన్నారు. అందుకే టాప్ స్టార్స్ అంతా చాలాసార్లు అల్లుళ్ల‌గా మారి జనాన్ని అలరిస్తూ వచ్చేవారు. చివరాకరికి బోర్ కొట్టి ఫార్ములా మార్చేసేదాకా తెచ్చారు. అలా పుట్టుకొచ్చింది మామా – కోడళ్ళ ట్రెండ్, ఒక డబ్బున్న మామ అంతకన్నా డబ్బున్న, లేదా కడు పేదరాలయిన కోడలు…ఇలా సాగాయి కొన్ని రోజులు. అయితే మళ్ళీ అత్తా – అల్లుడు అంటూ జనం మీదకు వదిలితే ఎందుకు చూస్తారు అనుకున్నాడేమో ? మారుతి. అందుకే తనకు అచ్చొచ్చిన స్పెషల్ డిసీజ్ ని ఈ సినిమాలో కూడా వాడాడు. అదే ‘ఈగో’. మరి మారుతి వాడిన వాడకం ఎలా ఉంది. వినాయక చవితి పండుగ దినాన వచ్చిన ఈ అత్తా, అల్లుళ్లు అల‌రించారా, లేదా? అనేది సమీక్షలో చూద్దాం.

స్టోరీ లైన్ :

sailaja-reddy-alludu-ramya-
చైతు (నాగ‌ చైత‌న్య‌) ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ నడుపుతూ ఉంటాడు. చిన్నప్పటి నుండి ఈగోతో నిండిన క్యారెక్టర్ తో ఉండే తండ్రి (మురళీశర్మ) ను చూసి విసుగు చెందిన చైతు పాజిటివ్ యాటిట్యూడ్ ని పెంచుకుంటాడు. తన చుట్టూ ఉండే అందరితో ఫ్రెండ్లిగా ఉంటాడు. అయితే తానొకటి తలిస్తే దైవమొకటి తలచాడని అతనికి ఇగో ఉన్న అమ్మాయే నచ్చుతుంది. మొదటి చూపులోనే అను (అను ఇమ్మాన్యుయేల్) ప్రేమలో పడతాడు. ఎలాగోలా ఆ ఈగోని తనదారిలోకి తెచ్చుకుని అనును ఇంప్రెస్ చేసిన చైతు పెళ్లి చేసుకోవడానికి సిద్దపడతాడు. అయితే ఊహించని విధంగా అప్పుడే కాబోయే అత్త శైల‌జారెడ్డి (ర‌మ్య‌కృష్ణ‌)కు మ‌రింత ఈగో. మరి ఒక ఈగో తండ్రి, ఈగో లవర్, ఈగో అత్తల మూడు రకాల ఈగోలు ఈ కధను ఎన్ని రకాల మలుపులు తిప్పాయనేదే కధ.

విశ్లేషణ :

sailaja-reddy-allugu-nag-chదర్శకుడు చాలా రొటీన్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. తెలుగులో ఇప్పటి వరకు అత్త, అల్లుడు కాంబినేషన్‌లో చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో కొన్ని సూపర్ డూపర్ హిట్లయ్యాయి. మరికొన్ని బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. అయినప్పటికీ ఈ ఫార్ములాతో సినిమాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఈ కధలో ఈగో అనే విషయాన్నీ వాడుకున్న మారుతీ కాస్త వైవిధ్యంగా తెరకెక్కించడానికి ప్రయత్నించాడు. కానీ ఫ‌స్టాఫ్ చాలా క‌ష్టంగా బోరింగ్‌గా ఉంది. ఫ‌స్టాఫ్ మొత్తం ఒక సినిమా అనే ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకంటే హీరో, హీరోయిన్ల లవ్ సీన్లు హీరోయిన్ ఈగోఆమెను పడేయడానికి హీరో చేసిన ప్రయ‌త్నాలు ఇవన్నీ ఓ మినీ సినిమాని త‌ల‌పిస్తాయి. సెకండాఫ్‌లో అంతా రమ్య కృష్ణ షో నడచింది అనే చెప్పాలి. ఫృథ్వీ, వెన్నెల కిషోర్‌ల‌తో న‌డిపించిన స‌న్నివేశాలు కాస్త నవ్వు తెప్పించినా సినిమాని సాగాదీయడానికి కారణమయ్యాయి.

silaja-reddy-alludu-nag-cha
నాగచైతన్య లుక్స్ మాత్రం సూపర్బ్ గా ఉన్నాయి. అలాగే చైతు పర్ఫామెన్స్ కూడా ఆకట్టుకుంది. చైతు నటనలో సరికొత్త హావభావాలు ప్రదర్శించడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ లో అద్భుతంగా నటించాడు. ఇక అను ఇమ్మాన్యుయేల్ తన అందంతో సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అహం నిండిన క్యారెక్టర్ తో సరికొత్తగా నటించింది. ఈ సినిమాతో అనూ నటనలో మరో మెట్టు ఎక్కినట్టే. ఇక రమ్య కృష్ణ సినిమాకి ప్రధాన ఆకర్షణ. మురళీశర్మ, సీనియర్ నరేష్, కమెడియన్ పృథ్వీ, వెన్నెల కిషోర్, శత్రులు తమ తమ పరిధి మేరకు నటించారు. సినిమా చాలా రిచ్‌గా ఉంది. గోపీ సుందర్ మ్యూజిక్ బాగుంది. మొత్తం మీద శైలజా రెడ్డి అల్లుడు అంచనాలను అందుకుందనే చెప్పాలి. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్ కు వెళ్ళిన ప్రేక్షకుడు సినిమాని ఎంజాయ్ చేస్తాడు.

తెలుగు బులెట్ పంచ్ లైన్ : శైలజా రెడ్డి అల్లుడు….రొటీన్ కధే కానీ రొటీన్ సినిమా మాత్రం కాదు
తెలుగు బులెట్ రేటింగ్ : 2.5 / 5