Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు జోధ్ పూర్ సెషన్స్ కోర్టులో మరోసారి ఊరట లభించింది. రెండు రోజుల జైలు జీవితం అనంతరం సల్మాన్ కు బెయిల్ మంజూరు చేసే సమయంలో దేశం దాటి వెళ్లకూడదని షరతు విధించిన న్యాయస్థానం ఇప్పుడు కొన్ని సడలింపులు ఇచ్చింది. ప్రస్తుతం సల్మాన్ భారత్, కిక్ 2, దబాంగ్ 3, రేస్ 3 సినిమాల్లో నటించాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ లన్నీ విదేశాల్లో జరగాల్సిఉండగా…సల్మాన్ పై కోర్టు తీర్పు నేపథ్యంలో అవి సందిగ్ధంలో పడ్డాయి. దీంతో సల్మాన్ సినిమా షూటింగుల నిమిత్తం తనకు మూడుదేశాల్లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం విదేశాల్లో షూటింగ్ లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. మే 25 నుంచి జులై 10 వరకు సల్మాన్ కెనడా, అమెరికా, నేపాల్ లో జరిగే షూటింగ్ లకు హాజరుకానున్నారు. 1998లో హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్ సమయంలో జోధ్ పూర్ అటవీ ప్రాంతంలో సల్మాన్ రెండు కృష్ణజింకలను వేటాడిన కేసులో 20 ఏళ్లపాటు విచారణ జరిగింది.
ఈ కేసులో సల్మాన్ ను దోషిగా నిర్దారించిన కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. రెండు రోజుల జైలు జీవితం తర్వాత ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేసింది. సల్మాన్ తో పాటు ఇతర నటీనటులపై బిష్ణోయ్ వర్గీయులు కేసుపెట్టి న్యాయం కోసం 20 ఏళ్లు పోరాడగా…కేవలం రెండంటే రెండే రోజులు జైలుశిక్ష అనుభవించి సల్మాన్ బెయిల్ పై విడుదలవడంపై పలువర్గాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు విదేశాలకు వెళ్లడానికి కూడా అనుమతించడం చూస్తే…కోర్టు తీర్పువల్ల రెండు రోజుల జైలు జీవితం మినహా సల్మాన్ కు ఎలాంటి నష్టం కలగలేదని అర్ధమవుతోంది. నేరం చేసి, దోషిగా తేలి కూడా ఆయన సాధారణ జీవితం గడుపుతుండగా…న్యాయం కోసం 20 ఏళ్లు బిష్ణోయ్ వర్గీయలు ఎలాంటి ప్రగల్బాలకు లొంగకుండా తమ సమయాన్నంతా వెచ్చించి చేసిన పోరాటం వృథాగా మారిందనే అభిప్రాయం వినిపిస్తోంది.