గతేడాది టాలీవుడ్‌ను కుదిపేసిన సంఘటనల్లో సమంత- నాగచైత్య విడాకులది అగ్రస్థానం. అప్పటిదాకా మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించారు. తమ దారులు వేరని, ఇకమీదట తాము దంపతులుగా జీవించబోమని వెల్లడిస్తూ అభిమానులకు షాకిచ్చారు. తర్వాత ఈ బాధ నుంచి తేరుకునేందుకు స్నేహితులతో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్లి వచ్చింది సామ్. ఇప్పుడిప్పుడే వాళ్లిద్దరూ ఆ విషయాన్ని మర్చిపోయి మళ్లీ మామూలవడానికి ప్రయత్నిస్తున్నారు.
అయితే తాజాగా సామ్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి విడాకుల ప్రకటనను తొలగించింది. దీంతో అభిమానుల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సామ్ ఎందుకు దాన్ని డిలీట్ చేసింది? వీళ్లిద్దరూ మళ్లీ కలిసిపోతున్నారా? లేదంటే మరేదైనా కారణం ఉందా? అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఒకవేళ నిజంగానే వీళ్లకు కలిసిపోయే ఉద్దేశ్యం ఉంటే చైతూ కూడా ఆ పోస్ట్ డిలీట్ చేసేవాడు, కానీ అలా జరగలేదు. అంటే చైసామ్ మళ్లీ కలిసే ఛాన్స్ లేనట్లు కనిపిస్తోంది. కాకపోతే సామ్ పొరపాటునో లేదా అవసరం లేదనో భావించి ఆ నోట్‌ను ఇన్‌స్టాగ్రామ్ నుంచి తీసేసి ఉండవచ్చని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఆమె ఇటీవల ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్ చేసి అదరహో అనిపించింది. ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా మూవీ ‘యశోద’, ‘శాకుంతలం’, ‘కాత్తువాక్కుల రెండు కాదల్’ సినిమాలతో పాటు ఓ హాలీవుడ్ చిత్రంతో బిజీగా ఉంది. బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌లో కూడా మూడు చిత్రాలు చేసేందుకు సైన్ చేసినట్లు టాక్ నడుస్తోంది.