విడాకుల అనంతరం సమంత సినిమాల పరంగా మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. వరుస ప్రాజెక్ట్స్‌కు సంతకం చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో డజన్‌కు పైగా సినిమాలు ఉన్నాయి. వాటిలో తన ఇంటర్నేషన్ ఫిలిం ‘అరెంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ కూడా ఉంది. ఈ సినిమాతోనే సామ్ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇదిలా ఉంటే సమంత ఇటీవల శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమాకు సంతకం చేసిన సంగతి తెలిసిందే.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కబోతోన్న ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా రూపొందనుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సోమవారం(డిసెంబర్ 6) పూజ కార్యక్రమాలను జరుపుకున్న ఈ మూవీ టైటిల్‌ను యశోదగా ఖరారు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే మొదలపెట్టనున్నట్టు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొత్త దర్శకులు హరి, హరిశ్‌లు డైరెక్షన్‌లో తెరకెక్కబోతోన్న ఈ థ్రిల్లర్ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలోని మిగతా తారాగణాన్ని కూడా త్వరలోనే వెల్లడిస్తామని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు.
ఈ మేరకు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘సమంత ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమిది. బాలకృష్ణగారితో ‘ఆదిత్య 369’ తీశాను. ఆయనతో మరో మూడు చిత్రాలు చేశాను. నానితో ‘జెంటిల్‌మన్’, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ నిర్మించాను. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. థ్రిల్లర్ జానర్‌లో నేషనల్ లెవల్‌లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో తీస్తున్న చిత్రమిది. సమంత క్రేజ్, పొటెన్షియల్, ఫ్యాన్ ఫాలోయింగ్‌కు తగ్గ కథ కుదిరింది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశాం. మార్చితో చిత్రీకరణ పూర్తవుతుంది’’ అని చెప్పారు.