సమ్మోహనం మూవీ రివ్యూ… తెలుగు బుల్లెట్

Sammohanam Movie review

నటీనటులు : సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, సీనియ‌ర్ న‌రేశ్‌, నందు, హ‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, త‌దిత‌రులు
ఎడిటర్ : మార్తాండ్ కె.వెంక‌టేశ్‌
నిర్మాత‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌
మ్యూజిక్ : వివేక్ సాగ‌ర్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌

హీరోని బట్టి సినిమా అనుకోకుండా కథా బలాన్ని నమ్ముకొని సినిమాలు తెరకెక్కించే నేటి దర్శకుల్లో ఒకడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అష్టాచమ్మా, జెంటిల్‌మన్‌, అమీతుమీ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న మోహనకృష్ణ ఈ సారి సమ్మోహన పరిచే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుధీర్‌ బాబు హీరోగా అదితిరావు హైదరీని హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన సమ్మోహనం తెలుగు ప్రేక్షకులని సమ్మోహన పరిచిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం…

కథ 

విజయ్‌ కుమార్‌ అలియాస్‌ విజ్జు (సుధీర్‌ బాబు) అందరు అబ్బాయిల్లా గర్ల్‌ ఫ్రెండ్స్‌, సినిమాలు అంటూ తిరగటం ఇష్టం లేని కుర్రాడు. కాస్త భిన్నంగా ఆలోచించే అలవాటున్న విజ్జు బొమ్మలతొ చిన్నపిల్లల కథల పుస్తకం గీస్తుంటాడు. ఎలాగైన అనగనగా పబ్లికేషన్స్‌ ద్వారా తన బొమ్మల పుస్తకాన్న విడుదల చేయించే ప్రయత్నాల్లో ఉంటాడు.సర్వేష్(సీనియర్‌ నరేష్‌), విజ్జు తండ్రి సినిమాల మీద ఇష్టంతో వాలెంటరీ రిటైర్మెంట్‌తీసుకొని మరీ సినిమా ప్రయాత్నాలు చేస్తుంటాడు. తన ఇంట్లో షూటింగ్ చేసుకోనిస్తే వేషం ఇస్తానని చెప్పటంతో ఓ సినిమా షూటింగ్‌కు ఇల్లు ఫ్రీగా ఇచ్చేస్తాడు సర్వేష్‌. ఆ సినిమాలో హీరోయినే మన సమీరా రాథోడ్‌ (అదితి రావు హైదరీ). షూటింగ్ ప్రారంభమైన తరువాత తెలుగు మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్న సమీరాకు విజ్జు కోచింగ్‌ ఇస్తాడు.

ఈ ప్రాసెస్‌లో ఒకరి మీద ఒకరికి ఇష్టం కలుగుతుంది. షూటింగ్ తరువాత కూడా సమీరాను మర్చిపోలేని విజ్జు ఆమెను కలిసేందుకు కులుమనాలీ వెళ్లి ఆమెకి తన ప్రేమ విషయం చెపుతాడు. కానీ సమీరా తనకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పటంతో విజ్జు,  సమీరా నుండి దూరంగా వెళ్ళిపోతాడు ఒకానొక దశలో ఆమెను ద్వేషిస్తాడు. అలా దూరమైన ఆ ఇద్దరూ మళ్ళీ ఎలా కలుసుకున్నారు, మొదట్లో ఎందుకు విడిపోయారు, పెద్ద స్టార్ అయిన సమీరా జీవితం ఎలాంటిది అనేదే ఈ సినిమా.

విశ్లేషణ:

దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి రాసుకున్న సున్నితమైన కథే ఈ సినిమాకు ప్రధాన బలం. ప్రేమకథకు బలమైన ఎమోషన్స్‌, కామెడీని జోడించి మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు. ముఖ్యంగా తొలి భాగంలో హీరో ఇంట్లో షూటింగ్ సమయంలో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. సినిమా వాళ్ల మీద వేసిన పంచ్‌లు బాగా పేలాయి. ఎమోషన్స్ తో నిండిన ఈ కథ ప్రేక్షకుడ్ని సినిమాతో పాటే ప్రయాణించేలా చేసింది. కథనంలో ఫ్లో తగ్గుతుంది అనుకునే సమయానికి ఒక ఎమోషనల్ సీన్ లేదా ఫన్ సీన్ వస్తూ సినిమాను గాడిలో పెడుతుంటాయి. నిజ జీవితంలో స్టార్స్ ఎలా ఉంటారు, వాళ్ళ జీవితాలు ఏంటి అనే సున్నితమైన అంశాన్ని ఎంతో కన్విన్సింగా డీల్ చేశారు ఇంద్రగంటి.

విజయ్‌ పాత్రలో సుధీర్‌ బాబు చక్కగా సరిపోయాడు. గత చిత్రాలతో పోలిస్తే నటనలో మంచి ఈజ్ కనబరిచాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ అ‍ద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడు. సమీరా పాత్రలో అదితి రావు హైదరీ స్టార్‌ ఇమేజ్‌, ప్రేమ, వేదింపుల మధ్య నలిగిపోయే అమ్మాయిగా అన్ని ఎమోషన్స్‌ను చాలా బాగా చూపించారు. హీరో తండ్రి పాత్రలో సీనియర్‌ నరేష్‌ సినిమాకు ప్లస్ అయ్యారు. కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. ముఖ్యంగా సుధీర్‌ బాబు, పవిత్రా లోకేష్ మధ్య వచ్చే సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి. రాహుల్‌ రామకృష్ణ, అభయ్‌, తనికెళ్ల భరణి, హరితేజ, నందు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన సంగీతం బాగుంది. పి.జి.విందా సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది.

తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : సమ్మోహన పరిచే సమ్మోహనం
తెలుగు బుల్లెట్ రేటింగ్ : 3.25 /5