గోటితో పోయి దాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారు’.. అనే సామెత వినే ఉంటారు. చిన్న సమస్యను పెద్దదిగా చేసి చివరికి ఊహించని నష్టం జరిగిన సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. అచ్చం ఈ సామెతలాగానే ఓ వ్యక్తి చిన్న విషయంలో ఏర్పడిన గొడవలో పోలీసులు, షాప్ యాజమాని వేధింపుల కారణంగా తన ప్రాణాలనే బలితీసుకున్నాడు. ఇంతకీ అతనికి వాగ్వాదం ఏర్పడింది ఓ రెండున్నర రూపాయల సమోస ధర విషయంలో.. అవును ఈ ఘటన మధ్యప్రదేశ్లోని అనుప్పూర్లో చోటుచేసుకుంది. జూలై 24న జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.
అమర్కాంటక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంధ గ్రామంలో బజ్రు జైవాల్ అనే వ్యక్తి స్నేహితులతో కలిసి జూలై 22వ తేదీన ఓ సమోసా స్టాల్ వద్దకు వెళ్లాడు. అక్కడ రెండు సమోసాలను తిన్నాడు. షాప్ మహిళా యాజమాని అయిన కంచన్ సాహు.. అతడిని రెండు సమోసాలకు 20 రూపాయలు అడిగింది. అయితే ఒక్కో సమోసా ఇంతకుముందు కేవలం రూ.7.50 ఉండేదని, ఇప్పుడు ఎందుకు రూ.20 ఇవ్వాలని ఆమెను జైవాల్ ప్రశ్నించాడు. సరుకుల ధరలు పెరగడంతో సమోస ధర పెంచినట్లు యజమాని బదులిచ్చింది. అయితే ఈ విషయంలో ఆమెకు అతడికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో ఓనర్ పోలీసులను సంప్రదించింది.
పోలీసులు కస్టమర్ జైవాల్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారించారు. అయితే సమోసా స్టాల్ యాజమాని, పోలీసులు తనను వేధిస్తున్నారని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పటించుకున్నాడు జైవాల్. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జూలై 24వ తేదీన మృతి చెందాడు. కాగా షాప్ యాజమానియే తనపై నిప్పంటించిందని పోలీసులు దాడి చేశారని జైవాల్ చనిపోయేముందు తీసుకున్న వీడియోలో ఆరోపించాడు.