దేశంలోని ఐఐటిలు, ఎన్ఐటిలు, ఐఐఎస్సిల నుంచి ఈ ఏడాది 1200మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను దేశంలోని పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డి) కేంద్రాల కోసం నియమించనున్నట్లు శామ్సంగ్ తెలిపింది. బెంగళూరు, నోయిడా మరియు డిల్లీలో తన ఆర్అండ్డి కేంద్రాలకు ఇంజనీర్లను నియమించాలని కంపెనీ యోచిస్తోంది.
నియమించబోయే ఇంజనీర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, క్లౌడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రికగ్నిషన్ సిస్టమ్స్, డేటా అనాలిసిస్ వంటి డొమైన్లలో పని చేస్తారు. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్ఫర్మేషన్టెక్నాలజీతో సహా పలు స్ట్రీమ్ల నుంచి విద్యార్థులను శామ్సంగ్ నియమించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
శామ్సంగ్ ఇండియా హెడ్ సమీర్ వాధవన్ మాట్లాడుతూ ఈ సంవత్సరం 1200 మంది ఇంజనీర్లను నియమించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే 340 ప్రీ-ప్లేస్ మెంట్ ఆఫర్లను ఐఐటిలు మరియు ఇతర ఉన్నత సంస్థలలోని ఇంజనీర్లకు అందచేశామని చెప్పారు.