Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తన కూతురు దారుణ హత్యకు గురయిన తర్వాత కూడా ఆమెపై దుష్ప్రచారం చేయడం తగదని సంధ్యారాణి తల్లి సావిత్రమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. కార్తీక్ తన కూతుర్ని రోజూ ఆఫీసుకు తీసుకెళ్లి, తీసుకొచ్చేవాడన్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించినా, బస్తీ వాసులను విచారించినా అసలు విషయం తెలుస్తుందన్నారు. కార్తీక్ కు, సంధ్యారాణికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఘటనలో నిందితుడి తల్లి హస్తం ఉందన్న అనుమానం కలుగుతోందని, ఆమెను కూడా విచారించాలని కోరారు.
కార్తీక్ ఇంటివద్దకు వెళ్లి వారి కుటుంబం గురించి విచారించగా వారు ఎంతో దుర్మార్గులని తెలిసిందన్నారు. తన కుమార్తెను దారుణంగా చంపిన కార్తీక్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తనను ఎలా కాల్చాడో అలానే అతన్ని కూడా కాల్చాలని ప్రాణంపోయే సమయంలో తన కూతురు కోరిందన్నారు. అటు సంధ్యారాణి హత్య మరో నిర్భయ ఘటనలాంటిదే అని మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు బత్తుల రాం ప్రసాద్ అన్నారు. మరణించిన తర్వాత కూడా ఆమెపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆమె ఆత్మ శాంతించదని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి తగులబెడితే… రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తక్షణమే సంధ్యారాణి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రూ. 50లక్షల నష్టపరిహారం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పక్కా ఇల్లు, సంధ్యారాణి తల్లి సావిత్రమ్మకు నెలకు రూ. 5వేల పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.