“సరిలేరు నీకెవ్వరు” రివ్యూ

“సరిలేరు నీకెవ్వరు” రివ్యూ

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా వరుస విజయ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. బ్యాక్ టు బ్యాక్ రెండు వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఆకట్టుకున్న మహేష్ ఈ చిత్రం ద్వారా హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.అందుకు తగ్గట్టుగానే చిత్ర యూనిట్ కూడా ఆ మ్యానియాను ఇన్ని రోజులు మైంటైన్ చేస్తూ ఒక రేంజ్ లో తీసుకొచ్చింది.మరి ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా లేదా అన్నది ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.

ఇక కథ లోకి వెళ్లినట్టయితే అజయ్ కృష్ణ (మహేష్ బాబు) భారత ఆర్మీలో మేజర్ గా పని చేస్తున్న నేపథ్యంలో జరిగిన ఒక ఊహించని పరిణామం రీత్యా ఆంధ్ర ప్రదేశ్ కర్నూల్ కు రావాల్సి వస్తుంది.ఈ ప్రక్రియలో సంస్కృతి (రష్మికా మందన్నా) పరిచయం అవుతుంది.అలా పరిచయం అయిన రష్మిక కుటుంబానికి కర్నూల్ లో ఉన్న విజయశాంతికి ఏమన్నా సంబంధం ఉందా?విజయశాంతి (భారతి) మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఘర్షణ మొదలవ్వడానికి గల అసలు కారణం ఏమిటి? అసలు వీరిద్దరి మధ్య లోకి మహేష్ ఎందుకు వస్తాడు అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

ఇప్పటి వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25 సినిమాలు ఒకెత్తు ఈ ఒక్క 26వ సినిమా ఒకెత్తు అనేలా ఈ చిత్రాన్ని ప్లాన్ చేసారని చెప్పాలి.అతి తక్కువ టైం లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసేసినా అసలు మహేష్ కెరీర్ లోనే ఏ సినిమాకు రానంత హైప్ ను ఈ చిత్రం తెచ్చుకుంది.అందుకు తగ్గట్టుగానే అనీల్ చిత్రాన్ని సరిగ్గా హ్యాండిల్ చేశారు.ఫస్ట్ హాఫ్ లోని మొదలయ్యే ఆర్మీ ఎపిసోడ్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ యాక్షన్ ఎపిసోడ్ వరకు అద్భుతమైన స్క్రీన్ ప్లే తో మంచి ఎంటర్టైనింగ్ గా ఉంది.

ఫస్ట్ హాఫ్ లో వచ్చే “డాంగ్ డాంగ్” సాంగ్ లో మహేష్ వేసే స్టెప్పులతో “పోకిరి” టైం మహేష్ లోని డాన్స్ ను మనం చూడొచ్చు.అలాగే సెకండాఫ్ లో మైండ్ “బ్లాక్ సాంగ్” కు అయితే వీరు ఎందుకు అంత స్పెషల్ గా ఈ సాంగ్ జాగ్రత్తగా దాచారో అర్ధం అవుతుంది.అంటే ఆయా రేంజ్ లో ఈ సాంగ్ ఉంది.ఫస్ట్ హాఫ్ లోని వచ్చే ట్రైన్ ఎపిసోడ్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ లోని కొండారెడ్డి బురుజు సీన్ తో మరోసారి మహేష్ హిస్టరీ తిరగరాసేలా సినిమా వేరే లెవెల్లో ఉంటుంది.అలాగే లేడీ అమితాబ్ విజయశాంతి మరియు మహేష్ ల మధ్య కొన్ని ఎమోషనల్ ఎపిసోడ్స్ బాగున్నాయి.అంతే కాకుండా మహేష్ మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఉన్న కొన్ని కీలకమైన సీన్స్ ను అయితే అనీల్ చాలా చక్కగా హ్యాండిల్ చేసారని చెప్పాలి.

ఫస్ట్ హాఫ్ లోని కామెడీ, యాక్షన్ తో మొదలు పెట్టిన అనీల్ సెకండాఫ్ లో కూడా అలాగే మైంటైన్ చేసుకొని వచ్చారు.కథ పెద్దగా కొత్తగా అనిపించకపోయినా స్క్రీన్ ప్లే మంచి ఎంటర్టైనింగ్ గా మలచడం మూలాన అంత గొప్ప పాయింట్ లేని చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా మారిపోయింది.ఇక మహేష్ పెర్ఫామెన్స్ కు వచ్చినట్టయితే లుక్స్ పరంగా కొత్తదనం లేకపోయినా అదే లుక్స్ లో ఈ చిత్రం ద్వారా ఓ కొత్త మహేష్ ను చూడొచ్చు.ఎప్పుడో “ఖలేజా”లో చూసిన కామెడీ యాంగిల్ కానీ సరికొత్త బాడీ మాడ్యులేషన్ కానీ తప్పకుండా ఆకట్టుకుంటాయి.(ఫ్యాన్స్ కి అయితే మరీ నచ్చొచ్చు).

అలాగే హీరోయిన్ రష్మికా మంచి నటన కనబర్చడమే కాకుండా మంచి డాన్స్ స్టెప్పులతో ఇరగేసింది.అలాగే మరో కీలక నటులు అయినటువంటి విజయశాంతి ఎన్నో ఏళ్ల గ్యాప్ ఇచ్చినా “బాస్ ఈజ్ బ్యాక్” అన్నట్టు లేడీ అమితాబ్ ఈజ్ బ్యాక్ అనేలా పెర్ఫామ్ చేసారు.అక్కడ చిరు రీఎంట్రీకు దేవియే సంగీతం ఇక్కడ విజయశాంతి రీఎంట్రీకు దేవియే సంగీతం ఇవ్వడం కొసమెరుపు.ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చిన క్యామియో రోల్ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

అలాగే ప్రకాష్ నుంచి మరోసారి పర్ఫెక్ట్ విలనిజం ఈ చిత్రంలో మనం చూస్తాము.ట్రైన్ సీన్ లో బ్లేడ్ తో బండ్ల గణేష్ కాసేపే కనిపించినా ఆయన ట్రాక్ లో అదిరిపోయే కామెడీ చేసారు.అలాగే సంగీత చాలా కాలం తర్వాత మళ్ళీ ఓ మంచి రోల్ చేసారు.వెన్నెల కిషోర్, పోసాని, రావు రమేష్ తదితరులు వారి వారి పాత్రల పరిధి మేరకు కీ రోల్ పోషిచారు.అలాగే మరో కీలక పాత్రలో నటించిన సత్యదేవ్ ఎప్పటిలానే తనదైన ఈజ్ నటన కనబర్చారు.

ఇక దర్శకుడు అనీల్ విషయానికి వస్తే తన గత చిత్రాల్లోలానే అదిరిపోయే కామెడీ మేనరిజంలతో పాటుగా మహేష్ లోని కామెడీ యాంగిల్ ను మరోసారి అద్భుతంగా చూపించారు.అంతే కాకుండా కామెడీని మించిన యాక్షన్ ను చూపించారు.ఈ దెబ్బకు మళ్ళీ మహేష్ ఫాన్స్ అనీల్ తో ఓ సినిమా చెయ్యమని అడిగినా అడుగుతారు.అయితే అనీల్ ఎంచుకున్న కథలో పెద్దగా కొత్తదనం లేకున్నా దాన్ని ఆవిష్కరించిన తీరే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ మరియు బలం.

కానీ స్టోరీ ఇప్పటికే చాలా మందికి తెలిసిపోవడం వంటి వాటి మూలాన సినిమా ఇలా ఉంటుంది అని మనం ముందే ఊహించేయ్యోచ్చు.ఇక దేవీ సినిమాలోని సాంగ్స్ అన్నీ ఒకెత్తు అయితే మాస్ మరియు ఎమోషనల్ సీన్స్ లో అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో ఎత్తు అని చెప్పాలి.ఇంటర్వెల్ బ్లాక్ లో ఇచ్చిన స్కోర్ అయితే మాములుగా ఉండదు.ఇక కెమెరామెన్ రత్నవేలు పనితనం ప్రతీ ఫ్రేమ్ లో మనం ఎంజాయ్ చెయ్యొచ్చు.అది చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది.

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే మహేష్ మరియు అనీల్ ల కాంబోలో వచ్చిన “సరిలేరు నీకెవ్వరు” చిత్రం తెలుగులో సంక్రాంతికి శుభారంభం,అభిమానులకు మరింత పెద్ద పండుగ తెచ్చి పెట్టిందని చెప్పాలి.అనీల్ మార్క్ కామెడీ ట్రాక్స్, మహేష్ మాస్ ఎలివేషన్ సీన్స్ వాటికి తగ్గట్టుగా దేవి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.కానీ రొటీన్ స్టోరీ మరియు ఊహించగలిగే కథనాలు మైనస్ అని చెప్పాలి.కాకపోతే అనీల్ టేకింగ్ మాత్రం వీటిని కవర్ చేసేస్తాయి.మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర మహేష్ బొమ్మ దద్దరిల్లింది అని చెప్పాలి.