అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ మరలా రాజకీయ ప్రవేశ సంకేతాలు ఇస్తున్నారు. ఈనెల 5వ తేదీ తరువాత లాక్డౌన్ ఎత్తివేయగానే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించబోతున్నట్లు సెల్‌ఫోన్ ద్వారా శనివారం కొందరికి చెప్పినట్లు సమాచారం. అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేలు కామరాజ్, పార్దిబన్, శివగంగై జిల్లాకు చెందిన ఉమాదేవన్, దిండుగల్లుకు చెందిన అరుస్వామి, చెన్నై తాంబరానికి చెందిన నారాయణన్‌లతో శశికళ శనివారం సెల్‌ఫోన్ ద్వారా సంభాషణ ఇలా సాగిందని తెలుస్తోంది.
‘ఎంజీ రామచంద్రన్, జయలలిత మనల్ని విడిచివెళ్లినా వారి ఆత్మ మనందరినీ గమనిస్తూనే ఉంది. అన్నాడీఎంకే శ్రేణుల నుంచి గత నాలుగేళ్లగా నాకు ఉత్తరాలు అందుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన తరువాత కూడా వస్తున్న ఉత్తరాలను చదివినపుడు ఎంతో ఆవేదన కలుగుతోంది. అన్నాడీఎంకేను అమ్మ జయలలిత ఎలా నడిపించారో అలానే నడిపించాలని ఆశిస్తున్నాను. ఈనెల 5వ తేదీతో లాక్డౌన్ ముగుస్తుందని అంటున్నారు. లాక్డౌన్ ఎత్తివేయగానే చెన్నై మెరీనా బీచ్‌లోని జయ సమాధి వద్దకు వెళ్లి అక్కడి నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభిస్తాను’అని వారితో చెప్పినట్లు తెలుస్తోంది.