అన్నాడీఎంకేను కైవశం చేసుకోవడం చిన్నమ్మ తరం కాదు అని మాజీ మంత్రి, అన్నాడీఎంకే నేత సీవీ షణ్ముగం, కడంబూరురాజు స్పష్టం చేశారు. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేందుకు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ వ్యూహాలకు పదును పెట్టి ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో జిల్లాల వారీగా అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశాల మీద నేతలు దృష్టి పెట్టారు.
ఆయా జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి, నేతలు ఎవ్వరు జారి పోకుండా ముందు జాగ్రత్తల్లో ఉన్నట్టుంది. ఆ మేరకు సోమ వారం విల్లుపురం జిల్లా కార్యవర్గం భేటీ సాగింది. ఈ సమావేశానంతరం మాజీ మంత్రి సీవీ షణ్ముగం మీడియాతో మాట్లాడారు. ఎండిన కరువాడు ఎలా చేప అవుతుందంటూ పరోక్షంగా చిన్నమ్మను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.