కలకలం రేపుతున్న శశికళ ఫోన్‌కాల్‌

కలకలం రేపుతున్న శశికళ ఫోన్‌కాల్‌

అన్నాడీఎంకే తన ఊపిరి అని, దానిని వేరు చేయడం ఎవరితరం కాదు అంటూ.. దివంగత సీఎం అమ్మ జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ అంశానికి సంబంధించిన ఫోన్‌కాల్‌ ఆడియో గురువారం వైరల్‌గా మారింది. అస్త్రసన్యాసం ప్రకటనను వెనక్కి తీసుకుని మళ్లీ రాజకీయ ప్రవేశానికి చిన్నమ్మ శశికళ సన్నద్ధమవుతోన్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా తన మద్దతు దారులతో ఆమె ఫోన్‌ ద్వారా మాటలు కలిపే పనిలో పడ్డారు.బుధవారం అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆనందన్‌తో ఫోన్లో మాట్లాడిన శశికళ, గురువారం శివగంగై జిల్లా కారైక్కుకుడి అన్నాడీఎంకే నేత ప్రభాకరన్‌తో ఐదు నిమిషాలకు పైగా మాటలు కలిపారు. ఈసందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకేలో చర్చకు దారి తీశాయి.

ఇప్పటి వరకు ఆమె 22 మంది నేతలతో మాట్లాడి ఉన్నట్టు సమాచారం ఉంది. ఈ సమయాల్లో ఎక్కడా ఆమె అన్నాడీఎంకే పేరును ఉచ్చరించలేదు. పార్టీని రక్షించుకోవాలని, నేను వస్తున్నాను.. అని మాత్రమే స్పందించారు. అయితే, తాజాగా, అన్నాడీఎంకే తన ఊపిరని, దానిని ఎవరూ వేరు చే యలేరని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.