నా గుండె పగిలింది

నా గుండె పగిలింది

జూలైలో శ్రీలంక పర్యటన సందర్భంగా గురువారం బీసీసీఐ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత​ సీనియర్‌ జట్టు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లడంతో సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సారధ్యంలో టీమిండియా రెండో జట్టు లంకతో సిరీస్‌ ఆడనుంది. ఐపీఎల్‌, ఇతర దేశవాలీ టోర్నీలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా జట్టులో చోటు కల్పించారు. రుతురాజ్‌, దేవదత్‌ పడిక్కల్‌, చేతన్‌ సకారియా వంటి యువ ఆటగాళ్లు ఎంపికయ్యారు.

ఇటీవలే రంజీ ట్రోపీలో దుమ్మురేపిన సౌరాష్ట్ర ఆటగాడు షెల్డన్‌ జాక్సన్‌ లంకతో పర్యటనకు కచ్చితంగా ఎంపికవుతానని భావించాడు. కానీ అతని ఆశలు తలకిందులయ్యాయి. ఈ సందర్భంగా తాను ఎంపికకాకపోవడంపై స్పందించిన షెల్డన్‌ జాక్సన్‌.. ” ఎంత బాగా ఆడినా ఎంపిక చేయలేదు.. నా గుండె పగిలింది” అంటూ ఎమోజీ షేర్‌ చేశాడు.

”ఇప్పుడు నా వయసు 34 ఏళ్లు.. కానీ బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాను.ఒక 22-23 ఏళ్ల కుర్రాడిలో దూకుడైన ఆటతీరు ఎలా ఉంటుందో అలా సాగుతుంది నా ఆటతీరు. ఆటకు వయసు అడ్డుగా కనిపిస్తే నేను ఏం చేయలేను.. లేటు వయసులో జాతీయ జట్టులోకి ఎంట్రీ లేదని క్రికెట్‌ పుస్తకాల్లో ఎక్కడా లేదు. ఒక ఆటగాడిని ఎంపిక చేయలాంటే అతని ఆటతీరు చూడాలని నేను నమ్ముతా. వరుసగా మూడు సీజన్ల పాటు రంజీ ట్రోపీలో 800-900 పరుగులు చేశానంటే ఫిట్‌గా ఉండడమే కదా అర్థం.

అతని వయస్సు 30 కంటే ఎక్కువ.. అందుకే సెలక్ట్‌ కాలేదు..ఈ పదం నేను చాలాసార్లు విన్నా” అంటూ ఆవేదన చెందాడు.ఇక షెల్డన్‌ జాక్సన్‌ రంజీ ట్రోపీలో వరుసగా మూడుసార్లు 700కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు 76 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 5634 పరుగులు, 60 లిస్ట్‌ ఏ మ్యాచ్‌ల్లో 2096 పరుగులు, 59 దేశవాలీ టీ20ల్లో 1240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు.. 44 అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా శ్రీలంక పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న టీమిండియా జూలై 13న తొలి వన్డే ఆడనుంది.