అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళకు ఎదురు దెబ్బ తగిలింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉండే హక్కును కోరుతూ వీకే శశికళ వేసిన పిటిషన్‌ను చెన్నై కోర్టు కొట్టివేసింది.
అన్నాడీఎంకేలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చి తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న వీకే శశికళకు ఎదురు దెబ్బ తగిలింది. 2017లో పార్టీ నుంచి తనను మహిష్కరిస్తూ అన్నాడీఎంకే పార్టీ సాధారణ మండలి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమె ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.
పార్టీ కో-ఆర్డినేటర్ పన్నీర్‌సెల్వం, జాయింట్ కో-ఆర్డినేటర్ పళనిస్వామి, లీగల్ వింగ్ జాయింట్ సెక్రెటరీ ఏఎం బాబు మురుగవేల్ ఇంటర్లోక్యూటరీ దరఖాస్తు దాఖలు చేయడంతో శశికళ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.
2017లో జరిగిన ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం.. అప్పటి ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించడంతో పాటు పార్టీ నుంచి బహిష్కరించించింది. ఈ వేటుపై శశికళ గతంలో చెన్నై సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. పన్నీర్‌సెల్వం, పళనిస్వామి నేతృత్వంలోని అప్పటి విడివిడి వర్గాల విలీనం తర్వాత ఈ కౌన్సిల్ భేటీ జరిగి.. శశికళను పార్టీ నుంచి వెలేస్తున్నట్లు ప్రకటించారు.