Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్… మోడీ క్యాబినెట్ లో ఆయనో ప్రత్యేక వ్యక్తి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన నేపథ్యం మాజీ ఐపీస్ అధికారి హోదా… ఐపీఎస్ గా కూడా ఆయన ఏదో మొక్కుబడిగా బాధ్యతలు నిర్వహించి రిటైర్ అవ్వలేదు. ఉన్నతాధికారిగా తనదైన ముద్రవేశారు. ఉత్తరప్రదేశ్ లోని భాగ్ పట్ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్యపాల్ సింగ్ ఉన్నత విద్యావంతులు. అంతర్గత భద్రతా వ్యవహారాలపై మంచి పట్టుంది. అనేక డిగ్రీలకు తోడు నక్సలిజం సమస్యపై పీహెచ్ డీ కూడా చేశారు. ఆ నేపథ్యంతోనే కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో చోటు దక్కించుకున్నారు.
అయితే కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిననాటినుంచి ఆయన ఫక్తు ఆరెస్సెస్ వాదిగా మారిపోయినట్టు మాట్లాడుతున్నారు. మానవ వనరుల శాఖ సహాయ మంత్రి హోదాలో శాస్త్రవేత్తల ఆవిష్కరణలకు కొత్త నిర్వచనాలు చెబుతున్నారు. గతంలో విమానాన్ని కనుగొన్నది రైట్ బ్రదర్స్ కాదని, వారి కన్నా ఎనిమిదేళ్ల ముందు శివకర్ బాపూజీ తల్పాడే అనే భారతీయుడు విమానాన్ని కనుగొన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని, అలాగే ఆధునిక విమానాల కన్నా ముందే మన దేశంలో పుష్పక విమానం ఉందని, రామాయణంలో ప్రస్తావనకు వచ్చే పుష్పక విమానం గురించి ఐఐటీ విద్యార్థులకు బోధించాలని సత్యపాల్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. తాజాగా… మరోసారి ఆయన ఈ తరహా వ్యాఖ్యలే చేశారు.
మనిషి పుట్టుక, ఎదుగుదలకు సంబంధించి ఇప్పటిదాకా డార్విన్ చెప్పిన జీవపరిణామ క్రమ సిద్ధాంతమే ఆధారం. ప్రపంచంలోని అన్నిదేశాలు దీన్ని నమ్ముతున్నాయి. పిల్లలకు పాఠాలుగానూ నేర్పిస్తున్నాయి. అయితే ఈ సిద్ధాంతాన్ని సత్యపాల్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డార్విన్ సిద్ధాంతం పూర్తిగా తప్పని, ఈ సిద్దాంతాన్ని పాఠశాలలు, కళాశాలల్లో బోధించడం ఆపాలని కూడా మంత్రి పిలుపునిచ్చారు. ఈ సిద్ధాంతం తప్పని ఆయనకు అనిపించడానికి గల కారణాన్ని కూడా వెల్లడించారు. మానవపరిణామ క్రమం గురించి డార్విన్ సిద్దాంతం ప్రతిపాదించిన విధంగా పురాతన భారతీయ గ్రంథాలు ఎక్కడా చెప్పలేదన్నది సత్యపాల్ సింగ్ అభ్యంతరం. భూమి ఏర్పడిన నాటి నుంచి మనిషి… మనిషిగానే సంచరించాడని, అలాగే ఎదిగాడని మంత్రి అన్నారు. డార్విన్ సిద్దాంతం శాస్త్రీయంగా కూడా నిరూపితం కాలేదన్నారు. అంతేకాకుండా ఆ సిద్ధాంతం తప్పని సైతం 35ఏళ్ల క్రితం శాస్త్రవేత్తలు నిరూపించారని మంత్రి గుర్తుచేశారు. మొత్తానికి హిందుత్వవాదిలా సత్యపాల్ చేస్తున్న వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.