హమాస్‌ను సమూలంగా నాశనం చేయాలని కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ గాజాపై విచక్షణారహితంగా విరుచుకు పడుతోంది. ఈ దాడుల్లో గాజాలోని సామాన్య పౌరులు పిట్టల్లా రాలిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచమంతా ఈ నరమేధాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నా, ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగిపోయేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా ఆ దేశానికి ఓ సూచన చేసింది.
ఇజ్రాయెల్‌కు తనను తాను రక్షించుకునే హక్కు ఉందని చెబుతూనే గాజాలో సామాన్య పౌరుల ప్రాణాలను రక్షించే అంతర్జాతీయ చట్టాలకు అణుగుణంగా ఇజ్రాయెల్ వ్యవహరించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసి మాట్లాడారు. గాజాలో సామాన్య పౌరులను రక్షించాలని ఈ సందర్భంగా బైడెన్ కోరారు. ఓవైపు వైమానికి దాడులు, మరోవైపు భూతల దాడులతో గాజాలో భీతావహ పరిస్థితులు ఎదురవుతున్నాయని, సరైన తిండి, నీరు లేక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా గాజా పౌరులకు మానవతా సాయం అందేలా చూడాలని నెతన్యాహుకు బైడెన్ ఫోన్లో సూచించారు.