సమాజం ఎంతో పురోగతి సాధించినప్పటికీ.. కొంతమంది వ్యక్తులు తమ చాదస్తపు ఆచార వ్యవహారాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంకా పద్దతులు.. పట్టంపులు పెట్టుకుంటూ వాటిని తరాలకు తరాలకు కొనసాగిస్తున్నారు. ఏమంటే.. అది తమ ఆచారంగా గొప్పలు చెప్పుకుంటున్నారు.అసలు విషయంలోకి వెళ్తే.. ఇద్దరు ప్రేమికులు రహస్యంగా వివాహం చేసుకోవడం.. ఒక యువకుడి ప్రాణాన్ని బలికొన్నది. పోలీసులు తెలిపిన వివరాలు గమనిస్తే… తమిళనాడులోని ఒండికుడిసాయి గ్రామానికి చెందిన సుధాకర్ 19 ఏళ్ల బాలికతో ప్రేమలో పడ్డాడు. ఆరు నెలల తర్వాత.. ఈ జంట పారిపోయి వాలాజపేటలోని ఒక ఆలయంలో వివాహం చేసుకుని 10 రోజులు ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఇద్దరూ తమ వివాహాన్ని నమోదు చేసుకోలేదు. అయితే.. బాలిక కుటుంబం ఈ జంటను గుర్తించి స్థానిక పంచాయతీ పెట్టి వేరు చేసింది. సుధాకర్ తన ప్రాణాలకు భయపడి చెన్నైకి పారిపోయి నగరంలో పనిచేయడం ప్రారంభించాడు. అయితే కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ చేయడానికి వారం ముందు అతడు తన గ్రామానికి తిరిగి వచ్చాడు. ఇది గమనించిన బాలిక కుటుంబీకులు పాత పగను దృష్టిలో పెట్టుకొని సుధాకర్ పడుకొని ఉన్న సమయం చూసి అతడిని దారుణంగా హత్య చేశారు.
కాగా అత్యంత వెనుకబడిన కులానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు సుధాకర్ హత్య తిరువన్నమలైలోని అరాని తాలూకాలో మత ఉద్రిక్తతలకు దారితీసింది. మొరప్పంతంగల్ నివాసి అయిన సుధాకర్ హత్య.. దంపతుల మధ్య కుల భేదాల కారణంగా జరిగిందని తెలుస్తోంది. అయితే బాలిక వన్నియార్ వర్గానికి చెందినది. బాలుడు వెనుకబడిన కులానికి చెందినవాడు. కుల ప్రభావం కారణంగానే ఈ హత్య జరిగినట్లు సమాచారం అందుతుంది. బాలిక తండ్రి, బంధువులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను 45 ఏళ్ల మూర్తి, 25 ఏళ్ల కె కాతిరవన్‌గా గుర్తించారు.