బ‌ల‌నిరూప‌ణ‌పై బీజేపీ ధీమా… తామే గెలుస్తామంటున్న కాంగ్రెస్-జేడీఎస్

SC Verdict floor test will be Conduct on May 19

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
క‌ర్నాట‌క వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు సంచ‌ల‌న ఆదేశాల నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. బ‌ల‌ప‌రీక్ష‌కు ఒక్క‌రోజే గ‌డువు ఉండ‌డంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ స‌ర్వ‌త్రా నెల‌కొంది. ఈ ఒక్క‌రోజూ ఎమ్మెల్యేల‌ను కాపాడుకుంటే విజ‌యం త‌మ‌దే అని భావిస్తున్న కాంగ్రెస్, జేడీఎస్… అందుకోసం అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాయి. కాంగ్రెస్ త‌ర‌పున గెలిచిన 78 మంది ఎమ్మెల్యేల్లో 76 మందిని గ‌త రాత్రి ప్ర‌త్యేక బ‌స్సుల్లో హైద‌రాబాద్ త‌ర‌లించింది. కాంగ్రెస్ నేత టి.సుబ్బ‌రామిరెడ్డికి చెందిన పార్క్ హయ‌త్ హోట‌ల్ లో ఎమ్మెల్యేలంతా మ‌కాం వేశారు. కాంగ్రెస్ కు చెందిన మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, రాజ‌శేఖ‌ర్ పాటిల్ ఇప్ప‌టికే పార్టీ ఫిరాయించిన‌ట్టు స‌మాచారం. జేడీఎస్ కూడా త‌మ ఎమ్మెల్యేల‌ను ర‌హ‌స్యస్థావ‌రాల‌కు త‌ర‌లించింది.

అటు బ‌ల‌ప‌రీక్ష‌పై అధికార, ప్ర‌తిప‌క్షాలు రెండూ ధీమాతో ఉన్నాయి. శ‌నివారం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు బ‌ల‌పరీక్షను ఎదుర్కోవాల‌ని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై కాంగ్రెస్ హ‌ర్షం వ్య‌క్తంచేసింది. సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స్వాగ‌తించారు. గ‌వ‌ర్న‌ర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించార‌ని తాము చెబుతున్న‌ విష‌యం సుప్రీంకోర్టు తీర్పుతో రుజువైంద‌ని వ్యాఖ్యానించారు. సంఖ్యాబ‌లం లేక‌పోయినా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేస్తాన‌న్న బీజేపీ వైఖ‌రిని కోర్టు త‌ప్పుబ‌ట్టింద‌న్నారు. చ‌ట్ట‌ప‌రంగా బ్రేక్ ప‌డింద‌ని, వారిక ధ‌న‌, కండ‌బ‌లంతో ప్ర‌జాతీర్పును దోచుకోడానికి ప్ర‌య‌త్నిస్తార‌ని రాహుల్ ట్వీట్ చేశారు. ప్ర‌జాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువ‌ల‌ను కాపాడేలా సుప్రీంకోర్టు తీర్పును వెలువ‌రించింద‌ని కాంగ్రెస్ నేత అశ్వినికుమార్ కొనియాడారు . న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై ప్ర‌జ‌ల‌కు ఉన్న న‌మ్మ‌కాన్ని సుప్రీంకోర్టు మ‌రోసారి నిల‌బెట్టుకుంద‌ని, అనైతిక విధానాల‌తో అధికారంలోకి రావాల‌నుకున్న బీజేపీకి సుప్రీంకోర్టు నిర్ణ‌యం చెంప‌పెట్టులాంటింద‌ని వ్యాఖ్యానించారు.

శ‌నివారం జ‌ర‌గ‌బోయే బ‌ల‌ప‌రీక్ష‌లో య‌డ్యూర‌ప్ప‌కు, బీజేపీకి ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని జోస్యంచెప్పారు. మ్యాజిక్ ఫిగ‌ర్ కంటే ఎక్కువ స్థానాలు ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ కూట‌మి బ‌ల‌ప‌రీక్ష‌లో గెలుపొంది, ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేస్తుంద‌న్నారు. అటు సుప్రీంకోర్టు తీర్పుపై బీజేపీ క‌న్న‌డ విభాగం ట్విట్ట‌ర్ లో స్పందించింది. స‌భ‌లో బ‌ల‌నిరూప‌ణ‌పై ఆత్మ‌విశ్వాసం వ్య‌క్తంచేసింది. బీజేపీకి త‌గిన సంఖ్యాబ‌లం ఉంద‌ని, బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గుతామ‌ని ధీమా వ్య‌క్తంచేసింది. జేడీఎస్-కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్న విష‌యం వారికి తెలుస‌ని, ఆ విష‌యం రేపు ప్ర‌పంచానికి కూడా తెలుస్తుంద‌ని ట్వీట్ చేసింది. మా బ‌లంపై సందేహం ఉన్న వారికి చెప్పేదొక‌టే… వేచిచూడండి అని కామెంట్ చేసింది. ఆరు కోట్ల మంది క‌న్న‌డిగుల దీవెన‌లు త‌మ‌కు ఉన్నాయ‌ని, వారి దీవెన‌ల‌ను గౌర‌విస్తామ‌ని, వారి ఆకాంక్ష‌ల్ని నెర‌వేరుస్తామ‌ని ప్ర‌క‌టించింది. బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గుతామ‌ని త‌మ‌కు వందశాతం న‌మ్మ‌కం ఉంద‌ని క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప వ్యాఖ్యానించారు. బ‌ల‌ప‌రీక్ష‌కు సిద్ధ‌మ‌ని, సుప్రీంకోర్టు ఆదేశాల‌ను పాటిస్తామ‌ని తెలిపారు. క‌ర్నాట‌క‌లో సుస్థిర‌మైన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసి, ఐదేళ్ల‌పాటు పాలిస్తామ‌ని య‌డ్యూర‌ప్ప విశ్వాసం వ్య‌క్తంచేశారు.