ఆకలితో అలమటిస్తోన్న ప్రజలు

ఆకలితో అలమటిస్తోన్న ప్రజలు

చైనాలో కరోనా పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది. ఎంత ప్రయత్నిస్తున్నా కోవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట పడడం లేదు. కోవిడ్‌కు కేంద్రంగా మారిన షాంఘై నగరంలో ఆదివారం 27 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. అయితే కేవలం 914 మందిలో మాత్రం కోవిడ్ లక్షణాలు ఉన్నాయి. తాజాగా మరో ప్రధాన నగరమైన గ్వాంగ్జౌలోనూ కొంతమంది కోవిడ్ బారిన పడడంతో అక్కడ కూడా కఠినమైన ఆంక్షలను విధించారు. సోమవారం నుంచి అక్కడ పాఠశాలలను క్లోజ్ చేశారు. పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తున్నారు.

అలాగే నగర ప్రజలు అనవసరంగా నగరాన్ని విడిచి వెళ్లకూడదని మున్సిపల్ అధికారులు ప్రకటించారు. ఒక వేళ సిటీ దాటి వెళ్లాలనుకుంటే తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని ఆదేశించారు. గ్వాంగ్జౌలో 27 కొత్త కేసులు బయటపడగా.. అందులో 9 మందికి ఎటువంటి లక్షణాలు లేవు. ఇక షాంఘైలో 27,173 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే షాంఘై నగరంలో కఠినమైన లాక్‌డౌన్ అమల్లో ఉంది. దీంతో చాలామంది తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటి నుంచి ఎవరిని బయటకు రానివ్వడం లేదు. దాంతో డెలివరీ ఫుడ్‌పైనే వారంతా ఆధారపడుతున్నారు. నిత్యావసరాలు, ఆహారం దొరకక అలమటిస్తున్నారు.

షాంఘై నగరంలో ఎన్నోరోజులుగా అపార్ట్‌మెంట్లలోనే ఉండిపోవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిటికీలు, బాల్కనీల్లోకి వచ్చి పెద్దపెద్దగా అరుపులు కేకలు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆకలి చావులు, ఆత్మహత్యలు సంభవిస్తాయని స్థానిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసులు పెరుగుతుండడంతో నిబంధనలు తప్పడం లేదని, కష్టమైనా కొన్నిరోజులు భరించాలని అక్కడి అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

లాక్‌డౌన్ కారణంగా నిత్యం ప్రజల రాకపోకలతో సందడి ఉండే షాంఘై మూగబోయింది. అదే సమయంలో స్థానిక కంపెనీలు మూతబడుతున్నాయి. దీంతో ఎంతోమంది ఉద్యోగాలు పోయి రోడ్డున పడుతున్నారు. కోవిడ్ కారణంగా డెలివరీల్లో జాప్యం జరుగుతున్న కారణంగా ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ నియో కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో అక్కడి ప్రజల్లో ఉద్యోగాలు కోల్పోతామేమోననే భయం నెలకొంది.

ఇదిలా ఉండగా మోర్గాన్ స్టాన్లీ నిర్వహించిన సర్వే ప్రకారం ఈ నెల ప్రారంభంలో 31 శాతం మంది చైనా ప్రజలు ఈఎంఐ‌లను, అద్దె చెల్లించలేమని ఆందోలన చెందుతున్నారు. అలాగే చాలామంది ఉద్యోగ భయంతో బాధపడుతున్నారని సర్వేలో తేలింది. నిజానికి కోవిడ్ వైరస్ మొట్టమొదటగా చైనాలోనే పుట్టింది. తర్వాత అనేక దేశాలకు పాకింది. అప్పటి నుంచి దశల వారీగా వైరస్ విరుచుకుపడుతూనే ఉంది. ప్రస్తుతం చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో కూడా కోవిడ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.