రెండో దశ కరోనా వైరస్

రెండో దశ కరోనా వైరస్

కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభించడంతో ఫ్రాన్స్‌లో మళ్లీ లాక్‌డౌన్ విధించారు. పరిస్థితి చేయి దాటకముందే చర్యలు చేపట్టాలని భావించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యూనుయేల్ మెక్రాన్ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను బుధవారం ప్రకటించారు. డిసెంబరు 1 వరకు లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన.. దేశంలో కరోనా వైరస్ రెండో దశ మొదలైందని పేర్కొన్నారు. తొలి దశ కంటే ముప్పు ఎక్కువగా ఉంటుందని, దీనిని ఊహించలేం కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని మెక్రాన్ హెచ్చరించారు.

గురువారం రాత్రి నుంచి బార్లు, రెస్టారెంట్లు, అత్యవసరం కాని వ్యాపార సంస్థలన్నీ మూసివేయాలని, ఇళ్ల నుంచి బయటకు రావాలంటే తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి లిఖితపూర్వక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉండకపోతే కొద్ది నెలల్లోనే 4 లక్షలకుపైగా మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఐసీయూల్లో 3వేల మంది ఉన్నారని, నవంబరు 15 నాటికి ఇది 9 వేలకు చేరుకునే పరిస్థితి ఎదురవుతుందని అన్నారు.

రెండోసారి విజృంభించకుండా ఉండాలనే ఉద్దేశంతో రెండు వారాల కిందటే పారిస్ సహా ఇతర ప్రధాన పట్టణాల్లో కర్ఫ్యూ విధించాం.. అయినా, రెండో దశను కట్టడి చేయలేకపోయామని మాక్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కరోనాకు 35 వేల మందికిపైగా బలయ్యారని తెలియజేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వచ్చే రెండు వారాల్లో మహమ్మారి వ్యాప్తి నెమ్మదిస్తే ఆంక్షల్లో సడలింపులు ఇస్తామని మెక్రాన్ స్పష్టం చేశారు.

గడచిన 24 గంటల్లో 36వేల మందికి వైరస్ నిర్ధారణ కాగా.. 244 మంది ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబరు నుంచి వైరస్ క్లస్టర్స్‌గా మారిన యూనివర్సిటీల్లో ఆన్‌లైన్ తరగతులను నిర్వహించునున్నారు. పరిశ్రమలు, ఇతర సంస్థల్లో కార్యకలాపాలకు అనుమతించనుండగా.. కొన్ని ప్రజా సేవలు కూడా కొనసాగుతాయి. వీలైనంత మేర సంస్థలన్నీ తమ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా చూడాలని మెక్రాన్ పేర్కొన్నారు.