దక్షిణాఫ్రికాతో జరుగనున్న రెండో టీ-20 మ్యాచ్ కోసం తమ యువ ఆటగాళ్లు ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తెలిపాడు. బ్యాటింగ్ విభాగంలో శ్రేయాస్ అయ్యర్, మానిష్ పాండే, రిషభ్ పంత్ చెలరేగాలనే కసితో ఉన్నట్లు విరాట్ తెలిపాడు. వీరిలో నాలుగో స్థానంలో అయ్యర్ లేదా మానిష్ పాండే ఆడనున్నారు. వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషభ్‌పంత్ తన స్థానాన్ని పదిల పరుచుకోవాలంటే అతడు ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా రాణించాల్సి ఉంటుంది. అతడు పదేపదే ఒకే తరహా షాట్లకు ప్రయత్నించి ఔటవడం ఆందోళన కలిగిస్తోంది. అతను తన బలహీనతను అధిగమిస్తాడని అశాభావం వ్యక్తం చేశారు కోహ్లి.
స్పిన్నర్లు కుల్దీప్, చాహల్ స్థానంలో జట్టులోకి వచ్చిన రాహుల్ చాహర్, వాషింగ్టన్ సుందర్ తమను తాము నిరూపించుకునేందుకు సిద్దంగా ఉన్నారు. పేస్ బౌలర్లు నవదీప్ సైనీ, దీపక్ చాహర్ విండీస్ టూర్లో చెలరేగిన విషయం తెలిసిందే. వారి ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నామనీ, ఆల్ రౌండర్లు పాండ్యా బ్రదర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వారి ప్రదర్శన అందరికీ తెలిసిందే. హార్ధిక్ జట్టు లోకి రావడం మరింత ఆనందదాయకం. దక్షిణాఫ్రికా జట్టు బలంగా ఉంది. అయినప్పటికీ వారిని ఎదుర్కొనేందుకు మా దగ్గర అన్ని అస్ర్తాలు ఉన్నట్లు ఈ డ్యాషింగ్ ప్లేయర్ పేర్కొన్నాడు.
కాగా, ధర్మశాల వేదికగా జరగాల్సిన మొదటి టీ-20 వర్షం కారణంగా రద్దయింది. ఈ రోజు రెండో టీ-20 మ్యాచ్ మొహాలీ వేదికగా రాత్రి 7 గంటలకు జరగనుంది. రెండు జట్లు విజయం కోసం తహతహలాడుతున్నాయి. రెండు జట్ల బలాబలాలను బేరీజు వేస్తే ఇండియా జట్టు బలంగా ఉంది.