రాయల్ చాలెంజర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. తొలుత ఆర్సీబీని 145 పరుగులకే కట్టడి చేసిన సీఎస్కే.. 18.4 ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించింది. సీఎస్కే విజయంలో రుతురాజ్ గైక్వాడ్(65 నాటౌట్; 51 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు)లతో రాణించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. కాగా, సీఎస్కే ఘన విజయం సాధించడంపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. అసలు సిసలైన ఆట తీరుతో సీఎస్కే మెరిసిపోయిందంటూ కొనియాడాడు.
ఇక్కడ ప్రత్యేకంగా సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనిని ప్రశంసించాడు. ధోని ఈజ్ బ్యాక్ అంటూ పేర్కొన్న సెహ్వాగ్.. ధోనిని ఫుల్ కెప్టెన్సీ మూడ్‌లో చూసిన మ్యాచ్ అని అభిప్రాయపడ్డాడు. పాత ధోనిని మరొకసారి చూశామని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఫీల్డ్‌లో పాదరసంలో వ్యూహాలు పన్నుతూ ఆర్సీబీని ఇరకాటంలోకి నెట్టాడన్నాడు. ప్రధానంగా బౌలింగ్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ తన మార్కు కెప్టెన్సీతో ధోని ఆకట్టుకున్నాడని సెహ్వాగ్ కొనియాడాడు. ముఖ్యంగా సాంత్నర్‌ను తుది జట్టులోకి తీసుకోవడం ఒక మంచి నిర్ణయమన్నాడు. అదే సమయంలో దీపక్ చాహర్, సామ్ కరాన్‌ల బౌలింగ్‌లో డెత్ ఓవర్లలో వేయించడం ధోని కెప్టెన్సీ మూడ్‌లోకి రావడాన్ని చూపెట్టిందన్నాడు.
మరొకవైపు ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లిల భాగస్వామ్యంపై సెహ్వాగ్ సెటైర్లు వేశాడు. వీరి భాగస్వామ్యం కోమాలో ఉన్నట్లు అనిపించిందన్నాడు. ఈ జోడీ 82 పరుగుల భాగస్వామ్యం పెద్దగా ఆకట్టుకోలేదని సెహ్వాగ్ తెలిపాడు. ఇదే ఆర్సీబీ ఓటమికి ప్రధాన కారణమన్నాడు. తన యూట్యూబ్ షో వీరు కీ బైతక్‌లో మాట్లాడుతూ..తనదైన శైలిలో విశ్లేషణ చేశాడు ఈ మాజీ ఓపెనర్.