‘ఫిదా’ చిత్రంతో గత సంవత్సరం ప్రేక్షకులను ఫిదా చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల ఇప్పటి వరకు మరో సినిమాకు కమిట్ అయ్యింది లేదు. తమిళంలో ఈయన విక్రమ్ తనయుడు ద్రువ్ హీరోగా ఒక చిత్రంను చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన వార్త ఏ ఒక్కటి బయటకు రాలేదు. ఎట్టకేలకు ఫిదా చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రంకు సిద్దం అయ్యాడు. నైజాం ఏరియాలో పలు చిత్రాలను పంపణీ చేసిన ఆసియన్ ఫిల్మ్స్ సంస్థ అధినేత సునీల్ నిర్మాణంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతుంది.
ఆసియన్ ఫిల్మ్ బ్యానర్‌లో మహేష్‌బాబు హీరోగా ఒక చిత్రం తెరకెక్కబోతున్నట్లుగా గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే మహేష్ వరుసగా చిత్రాలకు కమిట్ అయిన కారణంగా ఆసియన్ ఫిల్మ్‌లో సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ లోపు శేఖర్ కమ్ములతో ఒక చిన్న చిత్రాన్ని నిర్మించాలని ఈయన భావిస్తున్నాడు. ఒక యువ హీరోతో ఈ చిత్రం ఉంటుందని సమాచారం అందుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే పూర్తి స్థాయి స్క్రిప్ట్‌ను సిద్దం చేసి, హీరోను ప్రకటించి సినిమాను పట్టాలెక్కించాలని భావిస్తున్నారు. ఇదే ఏడాదిలో సినిమాను పట్టాలెక్కించి, వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు.