టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు బీసీసీఐ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న టి20 సిరీస్ భువనేశ్వర్‌కు కీలకంగా మారింది. ఈ సిరీస్‌లో గనుక భువీ రాణించకుంటే రహానే, పుజారాల మాదిరే జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉంది. సౌతాఫ్రికా పర్యటన తర్వాత బీసీసీఐ టెస్టు జట్టులోని సీనియర్ ఆటగాళ్లు పుజారా, రహానే, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహాలపై వేటు వేసింది.ఇషాంత్, సాహాలు జట్టుకు దాదాపు దూరమైనట్లే.. ఇక రహానే, పుజారాలు రంజీ సీజన్లో రాణించడంపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంది.
ఈ నేపథ్యంలోనే భువనేశ్వర్‌కు కూడా విండీస్‌తో టి20 సిరీస్ డెత్ సిరీస్‌గా పరిగణించొచ్చు. విండీస్‌తో తొలి రెండు టి20ల్లో మంచి ప్రదర్శన చేయకపోతే భువీపై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్ధమవుతుంది. కాగా తొలి టి20లో భువనేశ్వర్ 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఈ ప్రదర్శన అంత మెచ్చుకునేది కాదనే చెప్పొచ్చు. ఒకవేళ భువీపై వేటు పడితే మాత్రం.. భవిష్యత్తులో టీమిండియాలోకి రావడం కష్టమవుతుంది. ఇప్పటికే టెస్టులకు దూరమైన భువీ కొంతకాలంగా పరిమిత, టి20 మ్యాచ్‌ల్లోనే ఎక్కువగా ఆడుతున్నాడు. స్వింగ్ బౌలర్‌గా.. డెత్ ఓవర్ల స్పెషలిస్టగా పేరు పొందిన భువీ.. గాయం నుంచి కోలుకున్నాకా మునుపటి ఫామ్‌ను కొనసాగించలేకపోతున్నాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ సెలక్టర్లలో ఒకరు పేర్కొన్నారు.
”భువీకి ఇది చివరి అవకాశంగా భావించొచ్చు. గతేడాది ఐపీఎల్ నుంచే పాత భువీ కనిపించడం లేదు. దక్షిణాఫ్రికా పర్యటన అతనికి పీడకల మిగిల్చింది. ఇప్పటికే యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు టీమ్ మేనేజ్మెంట్ రెడీ అవుతుంది. ఒకవేళ షమీ తుది జట్టులోకి వస్తే భువీకి మరింత సమస్యగా మారుతుంది. విండీస్‌తో టి20 సిరీస్‌లో మూడు టి20ల్లో తొలి రెండు టి20ల్లో చేసే ప్రదర్శనపై అతని భవిష్యత్తు ఆధారపడి ఉంది. విఫలమైతే మాత్రం పుజారా, రహానేల మాదిరే జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉంటుంది.” అని చెప్పుకొచ్చారు.