బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. మహమ్మారి కరోనా కాటుకు సీనియర్ నటి, ప్రముఖ థియేటర్ ఆర్టిస్టు ఆశాలత వాగోంకర్(79) బలైపోయారు. గత కొన్ని రోజులుగా సతారాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం తుదిశ్వాస విడిచారు. కోవిడ్‌తో మృతిచెందిన ఆశాలత అంత్యక్రియలు సతారాలో నిర్వహించనున్నామని ఆమె కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. ఇటీవలే ఓ మరాఠీ సీరియల్ షూటింగ్ నిమిత్తం సతారాకు వెళ్లిన ఆమెకు కరోనా సోకిందని, సోమవారం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు.
కాగా ఆశాలత మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తూ ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నటీమణులు షబానా అజ్మీ, రేణుకా సహానేతో పాటు గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ ఆశాలత కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తన నటనతో ఎన్నో తరాలకు స్ఫూర్తిదాతగా నిలిచిన గోవా ఆర్టిస్టు ఆశాలత మరణం తీరని లోటు అని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మాజీ ముఖ్యమంత్రి ప్రార్థించారు.