Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
న్యూజిలాండ్ తో రెండో టీ20 తర్వాత ధోనీపై కొందరి నుంచి విమర్శలు వ్యక్తమయిన నేపథ్యంలో ఆయనకు పలువురు మాజీ క్రికెటర్ల నుంచే కాక నెటిజన్ల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. కివీస్ చేతిలో రెండో మ్యాచ్ ఓడిపోవడంతో… ధోనీ టీ20ల నుంచి తప్పుకుని కొత్తవారికి అవకాశమివ్వాలని వీవీఎస్ లక్ష్మణ్ సూచించారు. మరో క్రికెటర్ అజిత్ అగార్కర్ కూడా ఇదే సలహా ఇచ్చారు. ఎప్పుడూ ఎవరిపై విమర్శలు చేయని లక్ష్మణ్ ధోనీని ఉద్దేశించి ఇలా మాట్లాడడం అందరికీ ఆశ్చర్యం కలిగించినప్పటికీ… బ్యాటింగ్ దిగ్గజం కావడంతో… ఆయన ఆ వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరూ తప్పుబట్టలేదు. కానీ తన కెరీర్ లో జట్టులో పెద్దగా రాణించని అజిత్ అగార్కర్ మాత్రం ధోనీని విమర్శించడం అందరికీ ఆగ్రహం తెప్పించింది.
మాజీ క్రికెటర్ సయ్యద్ కిర్మాణి అయితే ఓ అడుగు ముందుకేసి ధోనీ ముందు అగార్కర్ ఎంత? ధోనీని విమర్శించే స్థాయి అతనికి లేదు అని వ్యాఖ్యానించారు. నెటిజన్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. మహోన్నత వ్యక్తి గురించి ఓ మామూలు వ్యక్తి విమర్శలు చేశారని కామెంట్ చేస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్ కు ధోనీ ఎప్పుడూ మాస్టరే అని, అగార్కర్ ధోనీపై విమర్శలు చేయడమంటే… ఓ స్థానిక ఎమ్మెల్యే ప్రధానమంత్రిని విమర్శించడమే అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. ధోనీపై విమర్శలు చేసే వారు ముందుగా తాము భారత క్రికెట్ కు ఏం చేశామో ఒక్కసారి ఆలోచించుకోవాలని కొందరు నెటిజన్లు సూచించారు. పనిచేయడానికి ఏమీ లేక, మీడియా ప్రచారం కోసం అగార్కర్ ఇదంతా చేస్తున్నాడని మండిపడ్డారు. మొత్తానికి మాజీ క్రికెటర్లతో పాటు నెటిజన్ల అభిప్రాయాలు చూస్తుంటే… ధోనీ మరికొన్నాళ్లు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది.