పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజాపోరాటయాత్ర కోసం సోమవారం రాత్రి భీమవరం చేరుకున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఒక రోజంతా చర్చల్లో మునిగి తేలారు. వైద్యులు, వివిధ విభాగాలకు సంబంధించిన అనేకమంది ఆయనను ప్రత్యేకంగా కలిశారు. అయితే భీమవరంలోని ఎన్‌డి.ఫంక్షన్ హాలులో బస చేసిన ఆయన మంగళవారం సాయంత్రం తనను చూసేందుకు వచ్చిన అభిమానులన పలుకరించేందుకు ఆవరణలోకి వస్తుండగా నేల తడిగా ఉండటంతో కాలు జారింది. దీంతో పవన్ కుడికాలు బెణికి నొప్పితో బాధపడ్డారు. వెంటనే వైద్యులు కట్టు వేసి చికిత్స అందించారు.
అయితే ఈ పర్యటనలో ముందునుండీ ప్రకటించినట్టుగానే యర్రా నారాయణస్వామి నివాసానికి మంగళవారం పవన్ కల్యాణ్ వెళ్ళారు. నారాయణ స్వామితో పాటు ఆయన కుమారుడు నవీన్ జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యర్రా నారాయణస్వామి కుమారుడు నవీన్ వైసీపీలో చేరనున్నారని ప్రచారం జరిగింది. దాదాపు పక్షం రోజుల కిందట వైసీపీ నేత, ఉండి ఎమ్మెల్యే సర్రాజు ఆయనతో జరిపిన మంతనాలు సఫలీకృతమవడంతో వైసీపీలో చేరేందుకు నవీన్ సిద్దమయ్యారు. త్వరలోనే పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి కూడా సిద్దమవుతున్న తరుణంలో పవనే ఇంటికి వచ్చి పార్టీలో చేరమని కోరడంతో నవీన్ ఆ పార్టీలోనే చేరనున్నారు.
భీమవరంలోని ఏఎస్‌ఆర్ నగర్‌లో ఉన్న అపార్ట్‌మెంట్ ప్లాట్‌లోకి వెళ్ళిన పవన్ ఆయనతో, కుమారుడు నవీన్‌తో సమావేశమయ్యారు. మొదట యర్రా నారాయణస్వామి దంపతుల పాదాలకు నమస్కారం చేశారు. తర్వాత పార్టీ గురించి చర్చించడానికి సిబ్బందిని, మిగతావారిని బయటకు పంపించారు. పవన్ వెళ్ళాక మీడియాతో మాట్లాడిన నవీన్ ప్రారంభం నుంచి తన తండ్రి నారాయణస్వామి తెలుగుదేశం పార్టీలో ఎన్నో సేవలు అందించారన్నారని, ఇప్పుడు తగిన గౌరవం లభించని కారణంగానే తాను, తండ్రి పార్టీ నుంచి బయటకు వచ్చి జనసేనలో చేరుతున్నట్లు చెప్పారు. నేటి నుంచి తాను పవన్ కల్యాణ్ వెంట పర్యటనలో పాల్గొంటానని చెప్పారు.