ఆకలేసి ఓ ముద్ద అన్నం దొంగిలిస్తే అది నేరం ఎంతమాత్రం కాదని ఓ ఇటాలియన్ కోర్టు తీర్పు వెలువడించింది. ఆస్తి హక్కు కన్నా ఆకలి తీర్చుకునే హక్కే ప్రధానమని కోర్టు నొక్కిమరీ చెప్పింది. జెనోవాలోని ఓ సూపర్ మార్కెట్లో రోమన్ అస్త్రియాకోవ్ అనే వ్యక్తి రెండు చీజ్ పొట్లాలు, ఒక సాసేజీ పొట్లం జేబులో కుక్కుకున్నాడు. బ్రెడ్డుకు మాత్రం డబ్బులు చెల్లించాడు. అది గమనించిన ఓ కస్టమర్ యాజమాన్యానికి ఆ విషయం తెలిపాడు. దాంతో పోలీసు డిపార్టుమెంటు, కోర్టు రంగంలోకి దిగాయి.
ఉక్రెయిన్ నుంచి వలస వచ్చిన ఆ వ్యక్తికి సొంత ఇల్లు లేదు. స్థిరమైన ఆదాయ మార్గంలేదు. దొంగతనం నేరం కింద కోర్టు 100 యూరోల జరిమానా (సుమారు రూ.8 వేలు), ఆరు నెలల జైలుశిక్ష విధించింది. తను చాటుగా తీసుకున్న సరుకుల విలువ అచ్చంగా నాలుగు యూరోలు. మన కరెన్సీలో అయితే సుమారు రూ.330. దీంతో కేసు అప్పీలుకు వెళ్లింది. ఈ ఘటనపై విచారించిన ఎగువ కోర్టు కింది కోర్టు తీర్పును రద్దు చేసింది. అతడు కేవలం తన ఆకలి తీర్చుకోవడం కోసమే ఆ పొట్లాలు తీసుకున్నాడు.
కనుక నేరం కాదని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని ఆసక్తికరమైన వ్యాక్యలు చేసింది. ఒక వ్యక్తికి చెందిన ఆస్తి దొంగతనానికి గురైందా.. లేదా? అనే దానికన్నా ఓ వ్యక్తి బతికి బట్టకట్టడం చాలా ముఖ్యమని కోర్టు వ్యాఖ్యానించింది. షేరు బియ్యం దొంగిలించాడని ఓ పిచ్చి మనిషిని కొట్టి చంపి, చాక్లెట్ జేబులో వేసుకున్నాడని ఓ బాలుడిని ఆత్మహత్యలోకి తరిమేస్తున్న రోజుల్లో ఇది కొంచెం ఆలోచించాల్సిన తీర్పే అంటూ అంతా చెవులు కొరుక్కుంటున్నారు.