ఉక్రెయిన్ సంక్షోభం ముదిరిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత కొలుకొన్నట్లు కనిపించిన మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా భగ్గుమంటున్నాయి. సోమవారం బ్యారెల్ చమురు ధర 9 డాలర్లకు పైగా పెరిగింది. ముగింపులో, బీఎస్ఈ సెన్సెక్స్ 1491 పాయింట్లు నష్టపోయి 52,842.75 వద్ద స్థిరపడితే, ఎన్ఎస్ఈ నిఫ్టీ 382.20 పాయింట్లు క్షీణించి 15,863.15 వద్ద ముగిసింది.
నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.99 వద్ద ఉంది.ఇక ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రతరంకావడం సహా రష్యాపై మరిన్ని ఆంక్షలకు పశ్చిమదేశాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. బెంచ్‌మార్క్ యూఎస్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌పై 9 డాలర్లు పెరిగి 124 డాలర్లకు ఎగబాకింది. లిబియాలోని రెండు కీలకమైన ఆయిల్ ఫీల్డ్స్‌ను సాయుధులు మూసివేశారని ఆ దేశ జాతీయ ఆయిల్ కంపెనీ ప్రకటన కూడా చమురు ధరలపై మరింత ఒత్తిడి పడింది.
మరోవైపు ఇప్పటికే వాహనరంగాన్ని కలవరపెడుతున్న చిప్‌ల కొరత మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య నేడు సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. నిఫ్టీలో భారతీ ఎయిర్టెల్, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ షేర్లు మాత్రమే తక్కువ లాభాలను అర్జీస్తే.. మిగతా అన్ని రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. ఇండ్‌ఇండ్ బ్యాంక్ షేర్లు అత్యధికంగా 7.48శాతం క్షీణించాయి.