దేశీయ స్టాక్​ మార్కెట్ల తీవ్ర నష్టాలు

దేశీయ స్టాక్​ మార్కెట్ల తీవ్ర నష్టాలు

ఉక్రెయిన్​ సంక్షోభం ముదిరిన నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత కొలుకొన్నట్లు కనిపించిన మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్​లో​ చమురు ధరలు భారీగా భగ్గుమంటున్నాయి. సోమవారం బ్యారెల్​ చమురు ధర 9 డాలర్లకు పైగా పెరిగింది. ముగింపులో, బీఎస్ఈ సెన్సెక్స్ 1491 పాయింట్లు నష్టపోయి 52,842.75 వద్ద స్థిరపడితే, ఎన్ఎస్ఈ నిఫ్టీ 382.20 పాయింట్లు క్షీణించి 15,863.15 వద్ద ముగిసింది.

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.99 వద్ద ఉంది.ఇక ఉక్రెయిన్​ సంక్షోభం తీవ్రతరంకావడం సహా రష్యాపై మరిన్ని ఆంక్షలకు పశ్చిమదేశాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్​లో చమురు ధరలు భారీగా పెరిగాయి. బెంచ్​మార్క్​ యూఎస్​ క్రూడ్​ ఆయిల్​ బ్యారెల్​పై 9 డాలర్లు పెరిగి 124 డాలర్లకు ఎగబాకింది. లిబియాలోని రెండు కీలకమైన ఆయిల్ ఫీల్డ్స్​ను సాయుధులు మూసివేశారని ఆ దేశ జాతీయ ఆయిల్​ కంపెనీ ప్రకటన కూడా చమురు ధరలపై మరింత ఒత్తిడి పడింది.

మరోవైపు ఇప్పటికే వాహనరంగాన్ని కలవరపెడుతున్న చిప్‌ల కొరత మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య నేడు సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. నిఫ్టీలో భారతీ ఎయిర్​టెల్​, హెచ్​సీఎల్​ టెక్​, టాటా స్టీల్​, ఇన్ఫోసిస్​ షేర్లు మాత్రమే తక్కువ లాభాలను అర్జీస్తే.. మిగతా అన్ని రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. ఇండ్​ఇండ్ బ్యాంక్ షేర్లు అత్యధికంగా 7.48శాతం క్షీణించాయి.