వరుసగా మూడో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

వరుసగా మూడో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

గత కొద్ది రోజుల క్రితం రంకెలేసిన బుల్‌ని బేర్‌ ఒక దెబ్బతో పడగొట్టింది. నేడు కూడా మార్కెట్‌లో బేర్‌ తన పట్టు నిలపుకుంది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి నవంబరు వరకు దాదాపు బుల్‌ రన్‌ కొనసాగింది. దాదాపు 60 వేల పాయింట్లకు పైగా పైకి చేరుకుంది సెన్సెక్స్‌. కానీ నవంబరులో ఒడిదుడుకులు మొదలయ్యాయి.

ఇన్వెస్టర్లు లాభాలు తీసుకునేందుకు మొగ్గు చూపుతుండటంతో సెన్సెక్స్‌ 60 వేల పాయింట్ల కిందకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలకు తోడుగా ఆటో, మెటల్స్​, ఐటీ సహా కీలక రంగాల్లో క్షీణతతో దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. మరోవైపు.. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా వచ్చిన పేటీఎం లిస్టింగ్​ ప్రభావం సైతం సూచీలపై ఉన్నట్లు నిపుణులు తెలిపారు. చివరకు, సెన్సెక్స్ 433.05 పాయింట్లు క్షీణించి 59,575.28 వద్ద ఉంటే, నిఫ్టీ 133.90 పాయింట్లు క్షీణించి 17,764.80 వద్ద ఉంది.

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.29 వద్ద ఉంది. నిఫ్టీలో ఎస్​బీఐ, పవర్​గ్రిడ్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, రిలయన్స్​, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ఎక్కువ​​ లాభాలను పొందితే.. టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఎంఅండ్ఎం, హెచ్​సీఎల్ టెక్నాలజీస్, ఎల్​&టీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఆటో, మెటల్ సూచీలు ఒక్కొక్కటి 2 శాతానికి పైగా కోల్పోవడంతో అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి.