స్టాక్ మార్కెట్ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిన బ‌డ్జెట్

Sensex slowly decrease after Arun Jaitley Budget Speech

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కేంద్ర బ‌డ్జెట్ దెబ్బ‌కు భార‌తీయ స్టాక్ మార్కెట్లు కుప్ప‌కూలాయి. బ‌డ్జెట్ ముందుదాకా ఆశ‌తో ఎదురుచూసిన మ‌దుపర్లు అరుణ్ జైట్లీ చేసిన ఒకే ఒక్క ప్ర‌తిపాద‌న‌తో తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. ఈక్విటీల్లో దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే లాభాలు రూ.లక్ష దాటితే 10శాతం ఎల్టీసీజీ ట్యాక్స్ విధించాల‌న్న జైట్లీ ప్ర‌తిపాద‌న స్టార్క్ మార్కెట్ల‌పై నెగిటివ్ ప్ర‌భావం చూపింది. బ‌డ్జెట్ కు ముందు వ‌రుస లాభాల‌తో రికార్డులు సృష్టించిన స్టాక్ మార్కెట్లు… బ‌డ్జెట్ మ‌రుస‌టిరోజే భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. ఆరంభం నుంచే న‌ష్టాల బాట ప‌ట్టిన సూచీలు అంత‌కంత‌కూ దిగ‌జారాయి. గంట‌ల వ్య‌వ‌ధిలోనే గ‌త రికార్డుల‌ను కోల్పోయాయి.

ఇవాళ ఒక్క‌రోజే సెన్సెక్స్ 2.34శాతం ప‌త‌న‌మైంది. 840 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 35,067వ‌ద్ద ముగిసింది. అటు నిఫ్టీ 2.33 శాతం న‌ష్ట‌పోయింది. 256 పాయింట్లు న‌ష్ట‌పోయి 10,761 వ‌ద్ద స్థిర‌ప‌డింది. ఈ ఏడాదిలో ఇదే అత్య‌ధిక ప‌త‌నం. దాదాపు అన్ని రంగాల షేర్లూ న‌ష్ట‌పోగా… ఒక్క ఐటీ షేర్లు మాత్రం ఫ‌ర్వాలేద‌నిపించాయి. 10శాతం ఎల్టీసీజీ ట్యాక్స్ విధించాల‌న్న జైట్లీ ప్ర‌తిపాద‌న‌కు తోడు ద్ర‌వ్య‌లోటు అంచ‌నాలు పెరగ‌డంతో వృద్ధిరేటు క‌ష్ట‌మేన‌ని కొన్ని రేటింగ్ సంస్థ‌లు వ్య‌క్తంచేసిన అభిప్రాయాలు ఇన్వెస్ట‌ర్ల సెంటిమెంట్ ను దెబ్బ‌తీశాయి. దీంతోపాటు ఈక్విటీ ఆధారిత మ్యూచువ‌ల్ ఫండ్ల‌నుంచి వ‌చ్చే ఆదాయం పైనా 10శాతం ప‌న్ను క‌ట్టాల్సిరావ‌డం, అంత‌ర్జాతీయ మార్కెట్లు సైతం ప్ర‌తికూలంగా ఉండ‌డంతో పెట్టుబ‌డిదారులు అమ్మ‌కాల‌కు మొగ్గుచూపారు.