సెన్సార్ ఇబ్బందుల్లో చిక్కుకున్న రామ్ గోపాల్ వర్మ

సెన్సార్ ఇబ్బందుల్లో చిక్కుకున్న రామ్ గోపాల్ వర్మ

‘అమ్మ రాజ్యంలో – క‌డ‌ప బిడ్డ‌లు’ అని పేరు మార్చుకున్న ‘క‌మ్మ రాజ్యంలో – క‌డ‌ప రెడ్లు’ విడుద‌ల కోసం ప్ర‌స‌వ వేద‌న ప‌డుతూనే ఉంది. ఈ సినిమాపై హైకోర్టు ప‌లు పిటీష‌న్లు స్వీక‌రించ‌డం, సెన్సార్ ఇబ్బందుల్లో చిక్కుకోవ‌డం తెలిసిన విష‌యాలే. సెన్సార్ బోర్డు ఈ సినిమాని క్షుణ్ణంగా చూసి, వివాదాలేం లేవ‌ని నిర్దారించుకున్న త‌ర‌వాతే సెన్సార్ స‌ర్టిఫికెట్ ఇవ్వాల‌ని హైకోర్టు ఆదేశించింది. ఈ సినిమాని వీక్షించిన సెన్సార్ బోర్డు చాలా విష‌యాల్లో అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. కొన్ని వ‌ర్గాల్ని, కొంత‌మంది రాజ‌కీయ ప్ర‌ముఖుల్నీ ఈ సినిమాలోని కొన్ని స‌న్నివేశాలు కించ‌ప‌రిచేలా సాగాయ‌ని సెన్సార్ బోర్డు భావించింది.

వాటిని తొల‌గించాల‌ని సెన్సార్ బోర్డు సూచించింది. అవ‌న్నీ తీసేస్తే క‌థ‌లో పెప్ మొత్తం పోతుంది. కొంత‌మంది ప్ర‌ముఖుల్ని పోలిన పాత్ర‌లు ఈ సినిమాలో ఉన్నాయ‌ని సెన్సార్ స‌భ్యులు గుర్తించారు. వారి నుంచి నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ తీసుకోవాల‌ని, అప్పుడే సెన్సార్ చేయ‌డం కుదురుతుంద‌ని చెప్పారట. ఇవ‌న్నీ జ‌ర‌గ‌డం అసాధ్యం. అయితే వ‌ర్మ రీషూట్ చేయాలి, లేదంటే యూ ట్యూబ్‌లో నేరుగా విడుద‌ల చేసుకోవాలి. అయితే ఈ సినిమాపై ఇప్ప‌టికే బిజినెస్ జ‌రిగిపోయింది. సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల కాక‌పోతే నిర్మాత‌లు ఇప్పుడు బ‌య్య‌ర్ల‌కు ఎదురుడ‌బ్బులు కట్టాల్సివ‌స్తుంది. మ‌రి వ‌ర్మ ఎలాంటి మాస్ట‌ర్ ప్లాన్ వేస్తాడో చూడాలి.