తెలుగు సీరియళ్లలో నటిగా చేస్తున్న లలిత అనే ఆమె అదృశ్యం అయ్యింది. హైదరబాద్ లేడీస్ హాస్టల్లో ఉంటూ షూటింగులకు వెళ్తున్న ఆమె వారం రోజులుగా తల్లితండ్రులకి ఫోన్ చేయక పోవడం హాస్టల్ కి కూడా వెళ్ళాక పోవడంతో ఆమె తల్లిదండ్రులు ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన లలిత(27) యాక్టింగ్ మీద మక్కువగా కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది. ఆమెకు వివాహమై ఓ బాబు ఉన్నా కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త నుంచి వేరుపడిన లలిత సీరియల్స్‌లో నటించేందుకు హైదరాబాద్ వచ్చేసింది. అమీర్‌పేటలోని రాజరాజేశ్వరీ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ షూటింగులకు వెళ్లే ఆమెకి తల్లిదండ్రులు వారం రోజులుగా ఫోన్ చేస్తుండగా స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో కంగారుపడిన వారు హైదరాబాద్ చేరుకుని హాస్టల్లో ఆరా తీశారు. లలితను వారం రోజుల క్రితం ఓ వ్యక్తి హాస్టల్ నుంచి తీసుకెళ్లాడని, అప్పటి నుంచి ఆమె తిరిగి రాలేదని హాస్టల్ నిర్వాహకులు చెప్పారు. దీంతో ఆమె తల్లిదండ్రులు తమకు తెలిసిన వారి వద్ద ఆరా తీసినా ఫలితం లేకపోయింది. దీంతో ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భర్తకు దూరంగా ఉంటున్న లలిత ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు ఆమె అతడితోనే వెళ్లినట్టు చెబుతున్నారు. లలిత హాస్టల్ వద్ద సీసీ కెమెరా పుటేజీని పరిశీలిస్తున్నారు. ప్రేమ, కల్యాణ వైభవం, స్వర్ణ ఖడ్గం తదితర సీరియళ్లలో లలిత నటిస్తున్నట్లు సమాచారం.