ఫేక్ పోస్టులు పెడితే అంతే సంగతులు.. అడ్మిన్ల పై కొరడా

అసలే ప్రపంచమంతా కరోనా వైరస్ తో అల్లల్లాడుతోన్న సమయం. ఇలాంటి అత్యవసర సమయంలో కొందరి ఆకతాయిలా చేష్టలు సమాజానికి చాలా ఇబ్బంకరంగా మారాయి. సోషల్‌ మీడియాలో ఫేక్ పోస్టులు కొన్ని వర్గాలను కించపరుస్తున్నాయి. ఇక మీదట ఎలాంటి పోస్టులు చేసినా అడ్డంగా బుక్కైనట్లే. రాచకొండ, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇలాంటి పోస్టులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇలాంటి పోస్టులను సుమోటో స్వీకరిస్తుంది.

కాగా ఏకంగా కరోనా మహమ్మారిపై సోషల్‌ మీడియాలో ఫేక్ న్యూస్ లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.  దీంతో హైదరాబాద్ పోలీసులు మేలుకొని సోషల్‌మీడియాలో వైరస్‌పై తప్పుడు ప్రచారం చేసినా.. ఓ  వర్గాన్ని కించపరిచేలా వ్యవహరించినా సైబరాబాద్‌, రాచకొండ అధికారులు సుమోటో కేసులు నమోదు చేస్తున్నారు.

అయిత అసలు సమాజాన్ని కరోనా వైరస్ పట్టి పీడిస్తుంటే… ఈ ట్విటర్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, టిక్‌టాక్‌ వంటి  సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఫేక్ న్యూస్ వైరల్‌ అవుతోండటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పవచ్చు. అసలు కరోనా వ్యాపించిందంటూ తప్పుడు పోస్ట్‌లు పెడుతుండటం ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురి చేస్తుంది.

అంతేకాకుండా కొంతమంది మద్యం దుకాణాలను తెరుస్తున్నారంటూ.. లాక్‌డౌన్‌ ఎత్తేస్తున్నారంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వైరస్ వ్యాప్తికి కారణమంటూ ఓ వర్గాన్ని కించపరిచేలా వీడియోలూ వైరల్‌గా మారడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేయడమే కాకుండా… భయభ్రాంతులకు లోనుచేస్తుంది.  మతాలు, కులాల వారీగా నెటిజన్లు విడిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడానికి దారితీస్తుంది. దీంతో ఇలాంటి సోషల్‌మీడియా జాడ్యంపై కన్నేయాలని పోలీసు కమిషనర్లు వీసీ సజ్జనార్‌, మహేష్‌ భగవత్‌ తమ సిబ్బందిని ఆదేశించారు. అయితే ఇలాంటి ఎన్ని హెచ్చరికలు చేసినా.. కొందరు నెటిజన్లు పట్టించుకోకపోవడంతో రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు రెండు సుమోటో కేసులు, కీసర సీఐ నరేందర్‌ మరో రెండు సుమోటో కేసులు నమోదు చేశారు.

వాట్సాప్ గ్రూపుల్లో ఎవరు అసభ్యకర, ఫేక్ న్యూస్‌లు పోస్ట్ చేసినా అడ్మిన్లపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీంతో వాట్సాప్‌ గ్రూపుల అడ్మిన్లు అప్రమత్తమయ్యారు. కొందరైతే తాము మాత్రమే ఆ గ్రూపుల్లో పోస్టులు పెట్టేలా సెట్టింగ్‌లు మార్చేశారు. మరికొంతమంది అందరినీ అడ్మిన్లుగా మార్చారు. ఇంకొందరేమో ఫేక్ న్యూస్ పోస్ట్ చేసే సభ్యులను తొలగిస్తుండటం విశేషం.