రాజస్థాన్లో అంతుచిక్కని వ్యాధితో పిల్లలు చనిపోతున్నారు. సిరోహి జిల్లా ఫుల్బాయి ఖేరా అనే గిరిజన గ్రామంలో ఆరు రోజుల్లో ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. మరణించిన ఏడుగురులో రెండేళ్ల కంటే తక్కువ వయస్సు వారు ఇద్దరు ఉన్నారు. వీరు వ్యాధి సోకిన కేవలం రెండు, మూడు గంటల్లో చనిపోయినట్టు వైద్య, ఆరోగ్య శాఖ జాయింట్ డైరక్టర్ డాక్టర్ జోగేశ్వర్ ప్రసాద్ తెలిపారు. మిగతా 10 నుంచి 15 ఏళ్లలోపు వయస్సున్న పిల్లలు 24 గంటల్లో మరణించినట్టు చెప్పారు.
గిరిజన గ్రామం సిరోహి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే బాధిత పిల్లలంతా మూర్ఛ, జ్వరంతో బాధపడుతూ చనిపోయారు. దీనిపై అధికారులు అప్రమత్తమై వెంటనే చర్యలు తీసుకున్నారు. సిరోహిలోని పిండ్వారా బ్లాక్లో ఉన్న ఫులాబాయి ఖేరా గ్రామానికి జైపూర్, జోధ్పూర్ నుంచి ప్రత్యేక బృందాలను పంపించారు. ఈ బృంద సభ్యులు సిరోహి జిల్లాలకు చేరుకుని పిల్లల మరణాలకు గల కారణాలు, మిస్టరీ వ్యాధి గురించి పరిశోధనలు జరుపుతున్నారని రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి పర్సాది లాల్ మీనా తెలిపారు. బాధితుల నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ కోసం పంపించినట్లు వెల్లడించారు.
అలాగే మరికొంత మంది చిన్నారులు కూడా జ్వరం, మూర్ఛలతో బాధపడుతున్నారని అధికారుల బృందం తెలిపింది. ఇంటింటికీ తిరిగి సర్వేలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అయితే వైరల్ ఎన్సెఫాలిటిస్ వల్ల పిల్లలు మరణించినట్లు వైద్య బృందం, వైద్యులు అనుమానిస్తున్నారని సిరోహి కలెక్టర్ భన్వర్ లాల్ అన్నారు. అయితే ఈ విషయాన్ని నిర్ధారించాల్సి ఉందని చెప్పారు. శుక్రవారం సాయంత్రానికి వ్యాధిపై స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉందన్నారు.