తమకు చదువుకోవడం ఇష్టం లేదని ఆడుకోవడం అంటేనే ఇష్టం అని రాసిపెట్టి విద్యార్థులు అదృశ్యమయ్యారు. బెంగళూరు బాగలగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పరిక్షిత్, నందన్, కిరణ్ అనే ముగ్గురు విద్యార్థులు ఒకే పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ఈ ముగ్గురు విద్యార్థులు చదువుపై ఆసక్తి లేకుండా ఆటలతోనే గడిపేవారు. చదువుకోవాలని ఇళ్లలో ఒత్తిడి చేస్తుండటంతో శనివారం ఉదయం ఇంటి నుంచి పారిపోయారు. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు విద్యార్థుల ఇంట్లో నుంచి లేఖలు లభించాయి. అందులో ‘మాకు చదువులంటే ఇష్టం లేదు. ఆటలంటేనే ప్రేమ. మాపై మీరెంత ఒత్తిడి తీసుకొచ్చిన చదువుకోవాలన్న ఆసక్తి లేదు. కబడ్డి లాంటి ఆటల్లో మా కెరీర్‌ను తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నాం. మంచి పేరు డబ్బులు సంపాదించిన తరువాత తిరిగి వస్తాం. మాకోసం మీరు వెతకవద్దు’ అని తల్లిదండ్రులకు చెబుతూ లేఖ రాశారు. లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు చుట్టు పక్కలా సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
లేఅవుట్ సమీపంలోనే మరో కేసులో 21 ఏళ్ల యువతితోపాటు మరో ముగ్గురు కనిపించకుండా పోయారు. అమృత వర్షిణి, 12 ఏళ్ల రోయన్ సిద్ధార్థ్, చింతన్, భూమి.. మొత్తం నలుగరు ఆదివారం అదృశ్యమయ్యారు. వీరిలో ఒకరి ఇంట్లో కూడా పోలీసులకు లేఖ లభించింది. అందులో చెప్పులు, టూత్ బ్రష్‌లు, టూత్‌పేస్ట్, వాటర్ బాటిల్, నగదు, క్రీడా వస్తువులను తీసుకెళ్లాలని రాసుంది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.