Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చిత్తూరు జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. పలమనేరు మండలంలోని మొరంలో డ్రైనేజీ శుభ్రం చేస్తున్న ఏడుగురు కార్మికులు మృతిచెందారు. వెంకటేశ్వర హేచరీస్ లో ఈ ప్రమాదం జరిగింది. హేచరీస్ యాజమాన్యం ఆదేశాలతో ఈ ఉదయం తొలుత నలుగురు కార్మికులు డ్రైనేజీలోకి దిగారు. అందులోకి వచ్చే వ్యర్థాల్లో రసాయనాలు కలవడంతో ఆ నలుగురూ అందులోనే స్పృహకోల్పోయారు. వారిని పైకి లాగేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు కార్మికులు కూడా విష రసాయనాలు పీల్చి అపస్మారక స్థితికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు హుటాహుటిన అక్కడకు చేరుకుని డ్రైనేజీ పై కప్పు తొలగించి కార్మికులను బయటికి తీశారు. చికిత్సకోసం వారిని పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా నలుగురు మార్గమద్యంలోనే మృతిచెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో కార్మికుడు చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఈ ఘటనతో మొరం గ్రామంలో విషాదం నెలకొంది. సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ, ఏఎస్పీ, ఇతర అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు.