భార్య అయిన‌ప్ప‌టికీ మిన‌హాయింపు లేదు

Sex with minor wife is rape, says Supreme Court

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బాల్య‌వివాహాల‌కు అడ్డుక‌ట్ట‌ప‌డేదిశ‌గా సుప్రీంకోర్టు ఓ తీర్పు వెల్ల‌డించింది. 18 ఏళ్లు నిండ‌ని మైన‌ర్ భార్య అయినా, ఆమెతో శృంగారం క‌ఠిన శిక్షార్హ‌మేన‌ని, నేరానికి పాల్ప‌డ్డ వ్య‌క్తికి సెక్ష‌న్ 375 ప్ర‌కారం మిన‌హాయింపులు ఇవ్వ‌లేమ‌ని, సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. దేశంలో జ‌రుగుతున్న బాల్య వివాహాల‌ను అడ్డుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని, ఈ విష‌యంపై కేంద్రం త‌క్ష‌ణ‌మే స్పందించాల‌ని కోరింది. ఐపీసీ చ‌ట్టాల ప్ర‌కారం ఓ వ్య‌క్తి 18 ఏళ్ల కంటే త‌క్కువ వ‌య‌సున్న బాలిక‌తో లైంగిక చ‌ర్య‌లో పాల్గొన‌డం నేరం. ఇందులో బాలిక ఇష్టం ఉన్నా లేక‌పోయినా దీన్ని నేరంగానే ప‌రిగ‌ణిస్తారు. అయితే స‌ద‌రు బాలిక ఆ వ్య‌క్తికి భార్య అయిఉండి, ఆమె వ‌య‌సు 15 ఏళ్లు మించితే ఈ చ‌ట్టం నుంచి మిన‌హాయింపు క‌ల్పించారు. ఆ చ‌ట్టాల‌కు అనుగుణంగానే గ‌తంలో కోర్టు తీర్పులుండేవి. మైన‌ర్ బాలిక‌లు భార్య అయిన‌ప్పుడు, ఆ దంప‌తుల మ‌ధ్య జ‌రిగే శృంగారాన్ని పెద్ద‌నేరంగా ప‌రిగ‌ణించ‌లేమ‌ని ఇంత‌కుముందు న్యాయ‌స్థానాలు వ్యాఖ్యానించాయి.

భార‌త వివాహ విలువ, దాంప‌త్య బంధాల‌న్న అడ్గుగోడ‌లు శిక్ష‌కు అడ్డంకుల‌ని అభిప్రాయ‌ప‌డ్డాయి. దీన్ని వ్య‌తిరేకిస్తూ ఓ ఎన్జీవో సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. బాల్య వివాహ‌మే చ‌ట్ట‌వ్య‌తిరేకం అయిన‌ప్పుడు 15 నుంచి 18 ఏళ్ల బాలిక‌ల‌పై కాపురం పేరుతో లైంగిక చ‌ర్య‌కు పాల్ప‌డ‌డం నేర‌మెలా కాద‌ని పిటిష‌న్ లో ప్ర‌శ్నించింది. వివాహితులైన‌ప్ప‌టికీ మైన‌ర్ల‌తో శృంగారం ఎంత‌మాత్రం స‌రైన‌ది కాద‌ని పిటిష‌న్ లో పేర్కొంది. దీనిపై విచార‌ణ జ‌రిపిన అత్యున్న‌త న్యాయ‌స్థానం ఎన్జీవో వాద‌న‌తో ఏకీభ‌వించింది. మైన‌ర్ల‌తో లైంగిక చ‌ర్య అత్యాచారం లాంటిదేన‌ని, దాన్ని నేరంగానే ప‌రిగ‌ణించాల‌ని తీర్పు ఇచ్చింది. దీనిపై చ‌ట్టం చేయాల‌ని కేంద్రానికి సూచించింది. జ‌స్టిస్ మ‌ద‌న్ బి. లోకూర్ నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పు వెల్ల‌డించింది. అటు భార్య వ‌య‌సు 18 సంవ‌త్స‌రాలు దాటిన త‌ర్వాత బ‌ల‌వంతంగా శృంగారానికి పాల్ప‌డ‌డాన్ని వైవాహిక అత్యాచారం గా ప్ర‌క‌టించే అంశంలో మాత్రం అత్యున్న‌త న్యాయ‌స్థానం ఎలాంటి వ్యాఖ్య‌లూచేయ‌లేదు. కాగా జాతీయ కుటుంబ ఆర్యోగ్య స‌ర్వే ప్ర‌కారం ప్ర‌స్తుతం 18 నుంచి 29 ఏళ్ల మ‌ధ్య ఉన్న యువ‌తుల్లో 46శాతం వివాహాలు 18 ఏళ్లలోపే జ‌రిగిపోయినట్టు వెల్ల‌డ‌యింది.