స్వరాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని భావించిన నిరుద్యోగ యువత ఆశలను సీఎం కేసీఆర్ ఆవిరి చేసి, మోసం చేశారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. నోటిఫికేషన్లు లేక.. ఉద్యోగం రాక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వనపర్తి జిల్లా తాడిపర్తి గ్రామానికి చెందిన కొండల్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. నిరుద్యోగ ఆత్మహత్యల విషయంలో మొద్దు నిద్రలో ఉన్న కేసీఆర్‌ను నిద్రలేపేందుకంటూ.. తాడిపర్తిలో షర్మిల ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు, ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసే వరకు ప్రతి మంగళవారం ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. గత ఎన్నికల ప్రచార సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 50 వేల ఉద్యోగాలంటూ హామీలిచ్చారని, అవి ఎందుకు భర్తీ చేయలేదో ప్రజలకు చెప్పాలన్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు దీక్ష చేశారు. మృతుడు కొండల్ మిత్రుడు రఘు నిమ్మరసం ఇచ్చి షర్మిలతో దీక్ష విరమింపజేశారు. అనంతరం గ్రామంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళ్లు అర్పించారు.