సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ చీఫ్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం ధర్నా వల్లే కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని టీఆర్ఎస్ నేతలు చెప్పుకోవడాన్ని ఆమె ఆక్షేపించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ కేసీఆర్‌కు ఓ సవాల్ విసిరారు.
మూడు గంటల ధర్నా చేసి రైతు చట్టాలను రద్దు చేపించామని కేసీఆర్ జబ్బలు చరుచుకుంటున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు. ‘మీరు అంత మొనగాళ్లయితే 6 గంటలు ధర్నా చేసి.. రైతుల వడ్లన్నీ కేంద్రం కొనేలా చెయ్యండి..’ అని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ‘మంచి జరిగితే మీ అకౌంట్లో వేసుకోవడం.. లేకుంటే పక్కోని మీద బట్టకాల్చి మీదేయడం మీకు అలవాటేగా..’ అని సీఎంను షర్మిల విమర్శించారు. కేసీఆర్ డ్రామా ధర్నా చేశారని అభివర్ణించారు.
ఉత్తుత్తి ఎన్నికల హామీలిచ్చినట్లు.. ఉత్తుత్తి కొనుగోలు సెంటర్లను పెట్టి రైతులను మోసం చేస్తామంటే ఊరుకోబోమని.. షర్మిల కేసీఆర్‌నుద్దేశించి ఫైర్ అయ్యారు. ఈ మేరకు మరో ట్వీట్ చేశారు. ‘ఉత్తుత్తి ఎన్నికల హామీలు ఇచ్చినట్టు.. ఉత్తుత్తి కొనుగోలు సెంటర్లను పెట్టి రైతులను మసిపూసి మారేడు కాయ చేయాలని.. మోసం చేయాలని చూస్తే వదిలిపెట్టం..’ అని షర్మిల హెచ్చరించారు. ‘సెంటర్లు పెట్టడం కాదు.. ముందు కాంటాలు పెట్టి.. రైతుల ధాన్యం వర్షం పాలు కాక ముందే కొనాలని డిమాండ్ చేస్తున్నాం..’ అని ఆమె పేర్కొన్నారు. ధాన్యం కొనకపోతే రాజీనామా చేయాలని సీఎంను డిమాండ్ చేశారు.