టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని, సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఆత్మహత్యల తెలంగాణగా మారుస్తున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. మంగళవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాల యంలో మీడియాతో ఆమె మాట్లాడారు. ఇటు కమీషన్లు.. అటు రైతుల ప్రాణాలు తీసుకుంటున్న కేసీఆర్ ఆకలి ఎప్పుడు తీరుతుందో అని ప్రశ్నిం చారు. ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ఆయన పాపం పోదన్నారు.
వడ్లు అమ్ముడుపోక, అప్పులు ఎక్కువై రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ఈ సర్కార్‌కు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ఏడేళ్లలో 7వేల మందికి పైగా రైతులు చనిపోయారని చెప్పారు. గత 70 రోజుల్లో 200 మందికి పైగా రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారంటే తెలంగాణలో అన్నదాత పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ నెల 19 నుంచి రైతు ఆవేదన యాత్ర చేపడతామని తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులందరి ఇంటికీ వెళ్తామని, ఆయా కుటుంబాలకు అండగా నిలబడతామన్నారు. రైతు ఆవేదనయాత్ర అనంతరం ప్రజాప్రస్థానం పాదయాత్ర, నిరుద్యోగ నిరాహార దీక్షలను కొనసాగిస్తామన్నారు.