తెలంగాణలో కేసీఆర్ పాలన దొంగల పాలనగా తయారైందని.. అధికారంలోకి రావడం కోసం అనేక హామీలిచ్చి తర్వాత అన్ని వర్గాలను మోసం చేశారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థానంలో భాగంగా ఆమె చేపట్టిన పాదయాత్ర ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని చింతపట్ల, తమ్మలోనిగూడ, నల్లవెల్లి, మాల్ గ్రామాల మీదుగా నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించింది.
ఈ సందర్భంగా రంగారెడ్డి–నల్లగొండ జిల్లాల సరిహద్దులో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. రాజన్న రాజ్యంలో అన్ని వర్గాలకు మేలు జరిగిందన్నారు. కేసీఆర్ ఏడేళ్ల పాలన నియంత పాలనగా మారిందన్నారు. 36 లక్షల మంది రైతులకు రుణమాఫీ, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీలకు మూడు ఎకరాల భూమి, మహిళలకు వడ్డీలేని రుణాలు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ఉద్యమకారుడని కేసీఆర్‌కు అధికారం ఇస్తే నీళ్లు ఫాంహౌస్‌కు, నిధులు కేసీఆర్ ఇంటికి, నియామకాలు కేసీఆర్ కుటుంబానికే దక్కాయని దుయ్యబట్టారు. వేల కోట్ల కమీషన్ల కోసమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. కాగా, రంగారెడ్డి జిల్లాలో షర్మిల పాదయాత్ర 12 రోజులు సాగింది.
రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని, రాజన్న బిడ్డగా తనను ఆశీర్వదించాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల కోరారు. ఆమె చేపట్టిన పాదయాత్ర ఆదివారం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వరనగర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారాలన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీకి అధికారం ఇస్తే రాజన్న పాలనను అందిస్తానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పిట్టా రాంరెడ్డి, కొండా రాఘవరెడ్డి, ఏపూరి సోమన్న, సురేశ్‌రెడ్డి, సత్యవతి పాల్గొన్నారు.