వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల శుక్రవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం షెట్లూర్ గ్రామంలో పర్యటించారు. మంజీరా నదిలో అక్రమ ఇసుక తవ్వకాల వల్ల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందగా.. బాధిత కుటుంబాన్ని, బంధువులను పరామర్శించారు. అనంతరం మంజీరా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలతో గ్రామస్తులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
క్వారీ నిర్వాహకులు నిబంధనల ప్రకారం మంజీరా నదిలో మూడు మీటర్లలోపు ఇసుక తొవ్వాల్సి ఉండగా, ఇందుకు విరుద్ధంగా 10 మీటర్ల వరకు తవ్వుతున్నారని వైఎస్ షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. ఇష్టారీతిన గుంతలు తీయడం వల్లనే వాటిలో నీళ్లు నిండి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు అతి వేగంగా నడపడంతో గ్రామానికి చెందిన ఓ యువకుడి కాలు కూడా విరిగిందని తెలిపారు.
అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఇసుక మాఫియాకు అడ్డాగా మారిందని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు అక్రమ ఇసుక తవ్వకాలను ప్రోత్సహిస్తూ కోట్లు దండుకుంటున్నారని, నిబంధనలను విరుద్ధంగా వాగులు, నదులను తోడేస్తున్నారని మండిపడ్డారు. ప్రమాదవశాత్తు గుంతల్లో పడి, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. అక్రమ ఇసుక తవ్వకాల వల్ల ఒకే కుటుంబంలో నలుగురు చనిపోతే కేసీఆర్ కనీసం పరామర్శించలేదని, వీరి మృతికి కారణమైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంజీరా నదిని అక్రమ తవ్వకాలకు అడ్డాగా మార్చారని విమర్శించారు.