బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ గురువారం తన 50వ పుట్టినరోజును జరుపుకున్నారు. గౌరీ, షారుఖ్లది ప్రేమ వివాహం అని అందరికి తెలుసు. చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్న వీరు వారి ప్రేమను దక్కించుకోవడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది. సినిమా హీరో అయిన షారుఖ్ కూడా నిజ జీవితంలో చాలానే కష్టాలు పడ్డారు. అయితే వారి ప్రేమ కథ ఏమిటో గౌరీ పుట్టిన రోజు సందర్భంగా ఒకసారి తెలుసుకుందాం.
జర్నలిస్ట్ అనుపమ చోప్రా రాసిన కింగ్ ఆఫ్ బాలీవుడ్: షారుఖ్ ఖాన్ అండ్ సెడక్టివ్ వరల్డ్ ఆఫ్ ఇండియన్ సినిమా అనే పుస్తకంలో వీరి ప్రేమ పెండ్లి పీటలు ఎక్కడానికి పడిన కష్టాలను వివరించారు. గౌరీని పెళ్లి చేసుకునే సమయానికే కింగ్ ఖాన్ టీవీ సీరియల్లో నటిస్తూ ఉన్నాడు. అయితే ఆయనను గౌరీ వాళ్ల ఇంట్లో ఎవరు అంగీకరించలేదు. గౌరీ తండ్రి, రమేష్ చిబ్బా, తన మతం కంటే షారుఖ్ నటనా వృత్తి పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
రమేష్, భారత మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ వద్ద పనిచేస్తున్నప్పుడు సినీ తారల జీవితాలను దగ్గరుండి చూడటంతో ఆయన ఆ వృత్తిని ద్వేషించారు. ఇక గౌరీ తల్లి సవితా, షారుఖ్‌ను తెరపై చూడటానికి ఇష్టపడిన గౌరీ తల్లి అల్లుడిగా మాత్రం అంగీకరించలేదు. ఇక గౌరీ వాళ్ల సోదరుడికి రౌడీ అన్న పేరు కూడా ఉండేది. అతను ఏకంగా షారుఖ్ తలపై గన్‌పెట్టి మరీ బెదిరించాడు. అయినా షారుఖ్ బయటపడకుండా తన ప్రేమను దక్కించుకున్నాడు. షారుఖ్, గౌరీ అక్టోబర్ 25, 1991 న వివాహం చేసుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా వారి బంధం బలంగా కొనసాగుతుంది. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వారి పేర్లు ఆర్యన్, సుహానా, అబ్రామ్.