కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ మరోసారి తన మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. క్లాస్ టచ్ అంటే ఇలా ఉంటుందంటూ వరుసగా రెండో సెంచరీని సాధించాడు. సీఎస్‌కేతో గత మ్యాచ్‌లో సెంచరీ సాధించి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన ధావన్.. పంజాబ్‌తో మ్యాచ్‌లో మరొకసారి చెలరేగిపోయాడు.
61 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 106 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఓ వైపు ఢిల్లీ టాపార్డర్ వికెట్లను చేజార్చుకున్నా ధావన్ మాత్రం బాధ్యతాయుతంగా ఆడాడు. ఈ క్రమంలోనే శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇది శిఖర్‌కు ఓవరాల్ ఐపీఎల్‌లో రెండో సెంచరీ కాగా, అది కూడా వరుసగా సాధించడం విశేషం. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండో సెంచరీలు సాధించిన తొలి ఆటగాడుగా ధావన్ రికార్డు నెలకొల్పాడు.
ధావన్ ఇన్నింగ్స్‌తో ఢిల్లీ 165 పరుగుల టార్గెట్‌ను బోర్డుపై ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ ఆదిలోనే పృథ్వీ షా(7) వికెట్‌ను కోల్పోయింది. నీషమ్ బౌలింగ్‌లో పృథ్వీ షా క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరుణంలో శిఖర్‌కు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జత కలిశాడు. వీరిద్దరూ 48 పరుగులు జత చేసిన తర్వాత అయ్యర్(14) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ ఔటయ్యాడు.
ఆపై రిషభ్ పంత్(14) కూడా నిరాశపరిచాడు. కానీ ధావన్ మాత్రం అత్యంత నిలకడగా ఆడాడు. 57 బంతుల్లో12 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీని సాధించాడు. హిట్టర్లు స్టోయినిస్(9), హెట్‌మెయిర్(10; 6 బంతుల్లో 1 సిక్స్)ల నుంచి ఆశించిన మెరుపులు రాకపోవడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో షమీ రెండు వికెట్లు సాధించగా, నీషమ్, మురుగన్ అశ్విన్, మ్యాక్స్‌వెల్‌లు తలో వికెట్ తీశారు.