సంజయ్ రౌత్‌ సంచలన ఆరోపణలు

సంజయ్ రౌత్‌ సంచలన ఆరోపణలు

అమ్రావతి ఎంపీ నవనీత్ కౌర్‌ రాణాపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీ-గ్యాంగ్‌తో సంబంధాలున్న యూసుఫ్‌ లఖడీవాలా నుంచి ఆమె 80 లక్షలు రుణం తీసుకున్నారన్నారని ఆరోపించారు. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో యూసుఫ్ నిందితుడిగా ఉన్నాడని.. అతనితో సంబంధాలున్న అందరినీ ఈడీ విచారిస్తోందని తెలిపారు. మరి ఎంపీ నవనీత్ రాణా ఆర్థిక వ్యవహారాలపై ఎందుకు దర్యాప్తు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు.

ఇది జాతీయ భద్రతకు ముప్పు కాదా అని అన్నారు. ఆ దంపతులను ఈ కేసుల నుంచి బయటపడేసేందుకు బీజేపీ యత్నిస్తోందని విమర్శించారు. ఇంత జరుగుతున్నా బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటోందని అన్నారు. యూసుఫ్‌ లఖడీవాలాకు చెందిన అక్రమ సొమ్ము నవనీత్ కౌర్‌-రాణా దంపతుల ఖాతాల్లో ఉందని సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు.

డీ-గ్యాంగ్‌తో వారికున్న లింకులపై విచారణ చేపట్టాలని ముంబై ఎకనమిక్స్ అఫెన్స్‌ వింగ్‌ పోలీసులకు సంజయ్‌ రౌత్‌ విజ్ఞప్తిచేశారు. ఈమేరకు మంగళవారం రాత్రి ట్వీట్‌ చేసిన ఆయన ప్రధాని మోదీ, మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ట్యాగ్‌ చేశారు. కాగా, ఇప్పటికే దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన నవనీత్ కౌర్‌-రాణా దంపతులపై తాజా ఆరోపణలను బట్టిచూస్తే మరో కేసు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన యూసుఫ్‌ లఖడీవాలా ఆర్థర్‌ రోడ్‌ జైలులో గతేడాది సెప్టెంబర్‌లో మరణించడం గమనార్హం.