మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీతో కూడిన మహావికాస్ అఘడి కూటమి సర్కార్‌లో విభేదాలున్నట్లు ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై శివసేన విమర్శలు చేయడం ఆ రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తిగా మారింది. రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో మాత్రమే యాక్టివ్‌గా ఉంటున్నారంటూ శివసేన అధికార పత్రిక సామ్నాలో ఎద్దేవా చేసింది.
ఇక మోదీ ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపడంలో ముందున్నప్పటికీ, అది కేవలం ట్విట్టర్‌కు మాత్రమే పరిమితమైందని అందులో ధ్వజమెత్తారు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకభిప్రాయం తీసుకురావడంలో రాహుల్ విఫలమయ్యారని రాసుకొచ్చింది. అదే సమయంలో విపక్షాలను ఏకం చేయడంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ విజయం ప్రశంసలు కురిపించింది.
శరద్ పవార్ మాదిరిగా రాహుల్ గాంధీ కూడా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి ఉంటే ఆ ప్రతిపక్షం బలంగా ఉండి ఉండేదని వివరించింది. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర శాఖ చీఫ్ నానా పటోలె వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ధీటుగా స్పందించారు. ఈ పరిణామాలను చూస్తుంటే విభేదాలున్నట్లు వస్తున్న వార్తలకు బలం చేకూర్చేలా ఉన్నట్లు తెలుస్తోంది.