తన పనులు తానే చేసుకుంటున్న ముఖ్యమంత్రి

తన పనులు తానే చేసుకుంటున్న ముఖ్యమంత్రి

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు కరోనా పాజిటివ్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన భోపాల్‌లోని చిరాయు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మహమ్మారి గురించి జనాలు ఎవరూ ఆందోళన చెందకుండా ఉండటం కోసం తన ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలతో పంచుకుంటున్నారు చౌహాన్‌.

వైరస్‌ బారిన పడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తన పనులు తానే చేసుకుంటున్నట్లు వెల్లడించారు. వైరస్‌ వల్ల తాను స్వయం సమృద్ధి గురించి తెలుసుకున్నానని తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో తనే సొంతంగా టీ పెట్టుకోవడమే కాక తన బట్టలు తానే ఉతుక్కుంటున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా శివరాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘నేను బాగున్నాను. నిత్యం ఏదో ఓ పని చేస్తూనే ఉన్నాను. దగ్గు కూడా తక్కువయ్యింది. మీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆస్పత్రిలో టీ చేసుకుంటున్నాను. నా బట్టలు నేనే ఉతుక్కుంటున్నాను. కాబట్టి జనాలు ఎవరు కరోనా గురించి భయపడవద్దు. ఇది మనకు స్వయం సమృద్ధి గురించి బోధిస్తుంది. కొన్నేళ్ల క్రితం నా చెయ్యి ప్రాక్షర్‌ అయ్యింది. ఫిజియోథెరపి అవసరం ఎంతో ఉంది.

కానీ ఇక్కడ ఆస్పత్రిలో నా చేతులు నిరంతరం ఏదో ఒక పని చూస్తూనే ఉన్నాయి. దాంతో నా చేతల పని తీరు కూడా బాగా మెరుగుపడింది’ అని తెలిపారు. గత వారం చౌహాన్‌ తనకు కరోనా పాజిటివ్‌గా తేలిందని ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. చిన్న అజాగ్రత్త వల్ల తనకు కరోనా సోకిందని తెలిపారు. ఆదివారం చౌహాన్‌ 75 సెకన్ల నిడివి గల ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. దీనిలో ఆయన తన ఆరోగ్యం ఎంతో బాగుందని తెలిపారు. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు. దీనిలో ఆయన బ్లూ కలర్‌ ఆస్పత్రి గౌన్‌ ధరించి కన్పించారు.