పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు. తీవ్రమైన ఛాతి నొప్పితో బాధపడుతున్నా.. దేశం కోసం ఆడటం గొప్ప విషయం అన్నాడు. రెండు రోజులుగా ఐసీయూలో ఉన్న వ్యక్తి.. మైదానంలోకి వచ్చి అద్భుత ప్రదర్శన కనబరిచిన తీరు అతడిపై గౌరవాన్ని మరింత పెంచిందని పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా ఆస్ట్రేలియాతో రెండో సెమీ ఫైనల్‌కు ముందు మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్ అందుబాటులో ఉండే విషయంపై సందిగ్దత నెలకొన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అనారోగ్య కారణాల దృష్ట్యా వారు జట్టుకు దూరం కానున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. రిజ్వాన్ ఫ్లూ కారణంగా బాధ పడుతున్నాడన్న విషయం బయటకు వచ్చింది. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు వైద్యుడు నజీబ్ సొమ్రూ… ‘‘నవంబరు 9న మహ్మద్ రిజ్వాన్ తీవ్రమైన చెస్ట్ ఇన్‌ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చేరాడు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన తర్వాత కోలుకున్నాడు’’ అని తెలిపాడు.
ఇక దుబాయ్ వేదికగా ఆసీస్‌తో మ్యాచ్‌లో రిజ్వాన్ అందుబాటులోకి రావడమే కాదు.. 67 పరుగులతో రాణించి పాకిస్తాన్ మంచి స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో రిజ్వాన్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని అనుకున్నారంతా! కానీ.. షోయబ్ అక్తర్ షేర్ చేసిన ఓ ఫొటో మాత్రం 29 ఏళ్ల రిజ్వాన్ మ్యాచ్‌కు రెండు రోజుల ముందు ఆస్పత్రి బెడ్‌పై ఎంతటి దీన స్థితిలో ఉన్నాడోనన్న విషయాన్ని కళ్లకు కట్టింది.
‘‘ఈరోజు ఈ వ్యక్తి దేశం కోసం ఆడటమే కాదు.. అత్యుత్తమంగా రాణించాడంటే మనం ఊహించగలమా! గత రెండు రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్నాడు! రిజ్వాన్ పట్ల గౌరవభావం అంతకంతకూ పెరుగుతూనే ఉంది’’ అని అక్తర్ తన పోస్టులో రాసుకొచ్చాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు అభిమానులు రిజ్వాన్ అంకితభావంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నిజమైన హీరో అంటూ కొనియాడుతున్నారు. ఇక సెమీస్‌లో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌పై విజయం సాధించి ఫైనల్‌కు దూసుకువెళ్లిన సంగతి తెలిసిందే.